28 May, 2026 | 2:35 AM

మంచి సినిమాలు తీసి పరిశ్రమను నిలబెట్టాలి

28-05-2026 01:13 AM

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘సమ్మర్ హాలీడేస్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ చాలా బ్యాడ్ షేప్‌లో ఉందనే మాట చెప్పడానికి తాను భయపడనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం పెద్ద సవాల్ అన్నారు. ‘సమ్మర్ హాలీడేస్’ వంటి చిత్రాలను తీయడం ద్వారా ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకురావాలని వ్యాఖ్యానించారు.

కొత్త దర్శకులంతా మంచి చిత్రాలను తీసి పరిశ్రమను నిలబెట్టాలని అన్నారు. చిన్న సినిమాలు ఎంత విజయం సాధిస్తే పరిశ్రమ అంత బాగుంటుందని అన్నారు. ఇటీవలి కాలంలో థియేటర్లలో సందడి కనిపించడం లేదని, ఈ చిత్రం ద్వారా థియేటర్లో సందడి నెలకొనాలని దిల్ రాజు ఆకాంక్షించారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన బాలల చిత్రం ‘సమ్మర్ హాలిడేస్‘. దీన్ని మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఇందులో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.