పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
శాసనసభ్యులు జారె ఆదినారాయణ
దమ్మపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సర్పంచ్ పగడాల రమాదేవి అధ్యక్షతన ప్రత్యేక అధికారి ఎంపీడీవో రవీందర్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ బండి అనంత్‌కుమార్, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది.
ఈ గ్రామ సభలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామసభ నిర్వహిస్తున్న స్థలం పంచాయతీ స్థలమని తెలిసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే ఎమ్మెల్యే నిధుల నుండి పది లక్షల వరకు కేటాయిస్తామన్నారు. అర్బన్ కాలనీ ఆనుకోని ఉన్న రాంజీ కుంటను సుందరీకరణ చేసే నిర్మాణ పనులు త్వరలో చేపడతా మన్నారు. డ్రైనేజ్ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని, పాలకవర్గ సభ్యులకు చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పేదవాడికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పాలకవర్గ సభ్యులు, నాయకులు స్వార్థం లేకుండా అందచేయాలన్నారు. స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు.




