calender_icon.png 12 July, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

12-07-2025 12:09:28 AM

  1. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు 
  2. హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
  3. ఫ్యూచర్ సిటీ, త్రిపుల్ ఆర్‌తో ఉపాధి అవకాశాలు 
  4. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి, దామోదర 
  5. రంగారెడ్డి జిల్లా మాడ్గులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రంగారెడ్డి, జూలై 11 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ సత్తా చాటాలని రోడ్లు భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

ప్రజాపాలనలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మూడున్నర ఏళ్లలో నెరవేరుస్తామని మం త్రులు పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మాడ్గులలో రూ.12.70 కోట్లతో నిర్మించే 30 పడకల ప్రభుత్వ దవాఖాన, మాడ్గుల వద్ద కోనాపూర్ నుంచి మాడ్గుల వరకు, మాడ్గుల నుంచి దేవరకొండ రోడ్ వరకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ (డబుల్ లేన్) రోడ్లకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

అంతకుముందు మంత్రులకు ఎ మ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మం త్రులు అంబేద్కర్, జ్యోతిరావు పూలే, చాకలి ఐలమ్మ, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో భాగంగా మాడ్గుల వద్ద కోనాపూర్ నుంచి మాడ్గుల వరకు, మాడ్గుల నుంచి దేవరకొండ రోడ్డు వరకు డబల్ లేన్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, ఉచిత కరెంట్, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశా మన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పా రు. ఫ్యూచర్ సిటీ, త్రిపుల్ ఆర్ రాకతో ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంలో రోడ్లను డబుల్ రోడ్లు గా మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణను కేసీఆర్ అప్పులు కుప్ప గా మార్చారని రూ.8 లక్షల కోట్ల అప్పులకు ప్రభుత్వం నెలనెలా రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆపడం లేదని ఆయన గుర్తు చేశారు. సోనియా గాంధీ కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని.. తెలంగాణ ఆకాంక్ష కోసం బిడ్డల ఆత్మ బలిదానాలు సోనియాను కదిలించిందన్నారు. 

మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ మాడ్గులలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, త్వరలోనే సంపూర్ణ మహిళా సాధికారతను సాధిస్తామని చెప్పారు.

దళిత బిడ్డలు 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేశారని, అది గుర్తించే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ అమలుకు కృషి చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని దామోదర గుర్తు చేశారు. అనంతరం మంత్రులు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.