21 May, 2026 | 2:41 AM

చరిత్ర తిరగరాయాలి.. కేసీఆర్‌ను సీఎం చేయాలి

21-05-2026 12:00 AM

పార్టీ సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పని చేయాలి  

కేసీఆర్ రావాలి & కాంగ్రెస్ పోవాలి అంటున్నారు

మాజీ ఎంపీ నామ

ఖమ్మం, మే 20 (విజయక్రాంతి): కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్ పార్టీకి బలం అని కార్యకర్తలు, నాయకులే బలగమని అని బీఆర్‌ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నాడు ఖమ్మంలోని తెలంగాణ భవన్ నందు ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అధ్యక్షతన ఖమ్మం, మధిర, వైరా, ఇల్లందు నియోజకవర్గాల సభ్యత్వ నమోదు మండల ఇంచార్జ్ల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలతో కలిసి మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కేసిఆర్ చేసిన కృషిని కొనియాడారు. మరల చరిత్ర తిరగరాసి కేసిఆర్ను ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. లక్షలాది మంది కార్యకర్తల బలం ఒక్క బీఆర్‌ఎస్ పార్టీకే సొంతమన్నారు.

పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో తాను తొలి ఓటు వేశానని, ఆ సందర్భానికి కేసిఆర్ సాక్షిగా ఉన్నారని గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాలుగా ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు పార్టీకి అందించిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. జిల్లాలో 10కు 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం అవసరమని, అందుకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతను చైతన్యవంతం చేయాలని, మండల ఇంచార్జ్లకు భవిష్యత్లో పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు.

పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పదవులు లేకపోయినా సేవలందిస్తున్న వారికి పార్టీ తగిన గుర్తింపు, అవకాశాలు కలిపిస్తుందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు లో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, ఆర్జేసి కృష్ణ, దిండిగల రాజేందర్, ఖమర్, మంజుల, గిరిబాబు, మండల, పట్టణ ఇంచార్జిలు పాల్గొన్నారు.