రుణ లక్ష్యాల సాధనకు సమన్వయంతో కృషి చేయాలి
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి అర్బన్ జూన్04,(విజయక్రాంతి): జిల్లా సంప్రదింపుల కమిటీ (ౄCC) జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (ౄLRC) సమావేశం గురువారం ఐడీఓసీ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ రంగాలకు సంబంధించిన రుణాల పంపిణీ, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, ఆర్థిక సమగ్రత కార్యక్రమాల పురోగతిపై బ్యాంకర్లు ,సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక అమలును సమీక్షించి, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు రుణాల అందజేతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా అందజేస్తున్న రుణాల పురోగతిని సమీక్షించారు. జిల్లాలో ఆర్థిక సేవలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా చర్యలు చేపట్టాలని, బ్యాంకులు ప్రజలకు మరింత చేరువ కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్ర శేఖర్, రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులు, నాబార్డ్ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్థాయి శాఖల అధికారులు పాల్గొన్నారు.






