15 May, 2026 | 3:27 AM

వానాకాలానికి సిద్ధం కావాలి

15-05-2026 01:49 AM

గజ్వేల్, మే 14: వానాకాలం పంట సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తావని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపారాణి విత్తన ఎరువుల డీలర్లకు సూచించారు. గురువారం గజ్వేల్ రైతువేదికలో గజ్వేల్ డివిజన్కు చెందిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు.  సమావేశానికి సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖాధికారి స్వరూపరాణి హాజరై మాట్లాడారు.

ప్రభుత్వం సన్నరకం వరి పంటలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందిస్తున్నందున రైతులను సన్నరకాల సాగుకు ప్రోత్సహించాలని డీలర్లకు సూచించారు. డీలర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ పొందిన కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు.

ధరల పట్టికలను రైతులకు కనిపించేలా ప్రదర్శించాలని, విక్రయించిన ప్రతి వస్తువుకు రశీదు ఇవ్వడంతో పాటు రైతుల సంతకాలు తీసుకోవాలని సూచించారు. గజ్వేల్ సీఐ రవికుమార్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో ఏడీఏ బాబు నాయక్, ఏఓ నాగరాజు, కొండపాక ఏఓ శివరామకృష్ణ, కుకునూర్పల్లి ఏఓ గోవిందరాజు, రాయపోల్ ఏఓ నరేశ్, ఏఈఓలు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.