calender_icon.png 2 October, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాకీ బుక్ మాత్రమే మాకు తెలుసు

02-10-2025 01:27:36 AM

  1. నేరాల నియంత్రణే కర్తవ్యం
  2. సోషల్ మీడియాలో హద్దు మీరితే కఠిన చర్యలు
  3. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
  4. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ డీజీపీగా 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, శౌర్యచక్ర గ్రహీత కే శివధర్ రెడ్డి మంగళవారం లక్డీకాపూల్‌లోని డీజీ పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టా రు. పదవీ విరమణ చేసిన మాజీ డీజీపీ జితేందర్ నుంచి ఆయన లాఠీని అందుకుని, రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “మాకు రెడ్ బుక్, పింక్ బుక్ తెలియదు.

మాకు తెలిసిందల్లా ఖాకీ బుక్, పోలీస్ బుక్ మాత్రమే” అని స్పష్టం చేశారు. రాష్ర్టంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే తన ప్రథమ కర్తవ్యం అని చెప్పారు. ప్రభుత్వ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి, తెలంగాణ పోలీసుల కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేస్తానని శివధర్‌రెడ్డి అన్నా రు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్త లు, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, వారికి అన్ని విధా లుగా అండగా ఉంటామని విజ్ఞప్తి చేశారు. రాష్ర్టంలో మావోయిస్టుల ప్రభావం లేదని, కాబట్టి చర్చల అవసరం ఏముంది? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు స్నేహపూర్వకమైన పోలీసింగ్ అందిస్తూనే, మాదకద్రవ్యాలు, ఇతర అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు.

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పారు. కాగా పోలీస్ శాఖలోని 17 వేల ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్ బి శ్రీనివాస్‌రెడ్డి, అదనపు డీజీలు మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు శివధర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.