08-12-2025 12:00:00 AM
సిద్దిపేట క్రైం, డిసెంబర్ 07 : ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అధికారులు, అభ్యర్థుల మధ్య పూర్తి సహకారం ఉండాలని సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులతో ఆదివారం అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయనతోపాటు తహసీల్దార్, ఎంపీడీవో, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమాలు, నైతిక ప్రవర్తన, శాంతిభద్రతల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఓటర్లకు డబ్బు పంపిణీ లేదా బెదిరింపులకు పాల్పడకూడదని, అభ్యర్థులు, వారి మద్దతుదారులు తప్పనిసరిగా శాంతియుత వాతావరణాన్ని పాటించాలని సూ చించారు. నామినేషన్ల పరిశీలన, ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు లేదా నియమావళి ఉల్లంఘనలు దృష్టికి వస్తే, తక్షణమే పోలీస్వారికి లేదా ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని కోరారు.