22 August, 2026 | 4:55 AM

పార్టీని వీడండి!

22-08-2026 02:11 AM

బహిష్కరించకముందే వెళ్లిపోండి

మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల హెచ్చరిక

  1. సీఎంపై వ్యాఖ్యలకు సుస్మిత క్షమాపణ చెప్పాల్సిందే 
  2. రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలి 
  3. పార్టీ అంతర్గత విషయాలపై రచ్చకెక్కొద్దు 
  4. సీఎంను బలహీనపరిచే కుట్రలను సహించం 
  5. బీఆర్‌ఎస్ డ్రామాలో పడొద్దని హితవు

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరోసారి రచ్చకెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, నాయకులు మూకుమ్మడిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలకు పట్టుబట్టారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ  కొండా సురేఖ మంత్రివర్గం నుంచి వైదొలగాలని, లేకుంటే ఆమె ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖతో పాటు పార్టీకి వ్యతిరేకం గా మాట్లాడుతున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవా లని కోరారు.  శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో  20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు మీడియాతో మాట్లాడారు.

సుష్మిత వ్యాఖ్యలతో  సంబంధం లేదని కొండా సురేఖ చెప్పడం సరిపోదని, కూతురు వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై చేసి న వ్యాఖ్యలకు సుష్మిత బహిరంగ క్షమాప ణ చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పార్టీ అంతర్గత విషయాలను పార్టీలోనే మాట్లాడకుండా బహిరంగ వ్యాఖ్య లు చేయటం ఏమిటని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ ఆడుతున్న రాజకీయ డ్రామాలో పడవద్దని హితవు పలికారు. పార్టీని, ప్రభుత్వాన్ని నష్టపరిచేలా వ్యవహరించటం కూర్చున్న చెట్టును నరుక్కోవడమేనన్నారు. అవసరమైతే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలే తప్ప.. బహిరంగ విమర్శలు చేస్తే ఒప్పుకోమని హెచ్చరించారు. 

ఇది సంస్కృతి కాదు : విప్ వేముల 

బహిరంగ విమర్శలు కాంగ్రెస్ సంస్కృ తి కాదని, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి, ఆయన నిర్ణయాలను తప్పు పట్టేవారికి పార్టీలో  కొనసాగే నైతిక అర్హ త లేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పార్టీ లైన్ దాటిని వారిపై చర్య లు తీసుకోవాలని  పీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశా రు. చెట్టుపైన కూర్చున్న కొమ్మనే నరుక్కునే తీరు సరైనది కాదన్నారు.కూతురు సుష్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని అంటున్న కొండా సురే ఖ.. ఆ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్ర మంత్రిగా సుష్మిత వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం ఉంది. పదవుల్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారని, మీ భాష ఎప్పుడూ పార్టీ కి తలనొప్పిగా మారండంతో పాటు నష్టం కలిగించేలా ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ను అధికా రంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన రక్తం ధారపోశారని, ఆయన సోదరులు కూడా చెమటోడ్చారని పేర్కొన్నారు. పార్టీ వేదికపై ఎవరైనా తమ అభిప్రాయాలను వెల్లడింవచ్చు, కానీ సీఎంపై తప్పుడు వ్యాఖ్యలు చేసినా, ఏకవచనంతో మాట్లాడినా సహించబోమని స్పష్టం చేశారు.

కొట్లాడి సాధించుకున్న ప్రభుత్వాన్ని ఇ బ్బందులకు గురి చేస్తున్నారని, పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి, అనామకులు తమ పార్టీ ఎమ్మెల్యేలపై నీచమైన భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. తాగుబోతుల్లా బజారులోకి వచ్చి మా ట్లాడితే అది బజారు సంస్కృతి అవుతుందే తప్ప.. కాంగ్రెస్ సంస్కృతి కాదని వీరేశం పేర్కొన్నారు. 

క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బాలునాయక్

పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్‌రెడ్డి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసన్నా రు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి కొండా సురేఖ కూతురు మాట్లాడిన తీరును కాంగ్రెస్ కార్యకర్తలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.

సీఎంను బలహీ నపర్చాలన్న కుట్రను అమలు చేస్తూ, ప్రతిపక్షాలకు ఆయుధాలను అందజేస్తున్నారని మండిప డ్డారు. పార్టీకి వ్యతిరేకంగా చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బాలునాయక్.. ఇలా ఎవరు మాట్లాడినా వా రిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

కులం, హోదాతో సంబంధం లేకుండా కఠిన చర్యలు ఉండాలి రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని,  ఎవరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, కుట్రలు చేసినా మళ్లీ రేవంత్ రెడ్డే సీఎం అవుతారని తెలిపారు. రేవంత్‌రెడ్డి బలహీనపడితే పార్టీ మొత్తం బలహీనప డుతుందన్నారు. 

 నాలుగు పార్టీలు తిరిగొచ్చినా మంత్రి పదవి ఇచ్చారు: ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

పార్టీలోని ముగ్గురు, నలుగురు వ్యక్తులు వాళ్ల పదవులు, స్వార్థం కోసం రోడ్లపైన పడి సీఎం రే వంత్‌రెడ్డిని టార్గెట్ చేసి ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించడం మంచిది కాదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హితవు పలికారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా కఠిన చర్య లు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

కొండా సురేఖ నాలుగు పార్టీలు తిరిగొచ్చారని.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారని విమర్శించారు. ఆమె ఏ పార్టీలోనైనా సరిగ్గా ఉన్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఫాంలు కూ డా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. అయినా మంత్రి పదవి ఇస్తే, ప్రతిఫలంగా మీరిచ్చే గౌరవం ఇదేనా? అని పేర్కొన్నారు.

జూనియర్లకు ఏం చెబుతారు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మితతో మంత్రి కొండా సురేఖనే మాట్లాడించారని అనుకుంటున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గతం లో కూడా సీఎంపై విమర్శలు చేశారని, అంతకుముందు సినిమా హీరోలపై నోటికొచ్చినట్లు మా ట్లాడారని, ఇప్పుడు సీనియర్ నేత రేవూరిపై ఇష్టానుసారంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి  చిన్నారెడ్డి మాటలు కూడా కరెక్ట్ కాదని, సీనియర్లు రోడ్ల పైకి వచ్చి మాట్లాడితే జూనియర్లు ఏం నేర్చుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే  ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బిడ్డ అడ్డగోలుగా మాట్లాడితే మందలిం చకుండా నా తప్పిదం కాదని చెప్పడం సరికాదన్నారు. ప్రకాశ్ రెడ్డిని రాజీనామా చేయమని అడ గడం కంటే వాళ్ల అమ్మను రాజీనామా చేయమని అడగాలన్నారు. 

రేవంత్‌రెడ్డి దమ్మున్న నేత: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రభుత్వ ప్రష్ఠను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపా రు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వాళ్ల కూ తురు పార్టీని, ముఖ్యమంత్రిని ఇబ్బందిపెట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బలహీనత అనుకుంటే తప్పు.. ఆయన చాలా బలవంతుడని, ఆయన దమ్ము, ధైర్యం ఉన్న నాయకు డు కాబట్టే ఆయనను తట్టుకోలేక కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాజగోపాల్‌రెడ్డి, సురేఖ, చిన్నారెడ్డి లాంటి వారి కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో పనిచేశారని తెలిపారు. ఈ సమావేశానికి కేవలం అందుబాటులో ఉన్న ఎ మ్మెల్యేలం మాత్రమే వచ్చామన్నారు. గ్రామస్థా యి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరూ సీఎంకు అం డగా ఉన్నారని తెలిపారు. వారి తీరును తెలంగాణ కాంగ్రెస్ సమాజం సహించదన్నారు.

పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్

పార్టీ కంటే నేనే పెద్ద అని అనుకోవడం పొరపాటని, జగిత్యాలలో జీవన్ రెడ్డి కూడా ఇలాగే వ్యవహరించారని ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ విమర్శించారు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని,  అన్ని కులాలు, మతాల ఎమ్మెల్యేలం కలిసి ఉన్నామని తెలిపారు. వ్యక్తిగత విభేదాలు ఉంటే అధిష్ఠా నానికి ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. తమ వల్లనే కాంగ్రెస్ గెలిచిందని అనుకుంటే సహించమని, పార్టీ కంటే తామే పెద్ద అనుకునే వాళ్లు పార్టీ నుం చి వెళ్లిపోవచ్చన్నారు. 

సుష్మిత వ్యాఖ్యలు సమంజం కాదు: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

కాంగ్రెస్ కార్యకర్తలు ఎత్తిన జెండాను దింపకుండా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని.. ప్రతిపక్షా లు, గిట్టని వాళ్లు మాట్లాడితే సరే.. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే విమర్శలు చేయడం సమంజసం కాదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. కొండా సురేఖ కూతురు సుష్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని, ఆమె మాటలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

అంతర్గత విషయాలను సీఎల్పీలో లేదా, ఇతర వేదికల్లో మాట్లాడాలన్నారు. కొందరు అధికారుల తీరువల్లే 22ఏ సమస్య వచ్చిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 39 వేల మందికి సంబంధించిన భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.