22 August, 2026 | 3:32 AM

సీఎంకు బాసటెవరు?

22-08-2026 02:07 AM
  1. రేవంత్ వ్యతిరేక స్వరాలపై 20 మందే గళం 
  2. మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి స్పందన కరువు
  3. మంత్రుల మౌనం వెనుక ఆంతర్యమేమిటి? 
  4. సుష్మిత వ్యాఖ్యలతో బయటపడుతున్న విభేదాలు
  5. ‘అచ్చ కాంగ్రెస్-పచ్చ కాంగ్రెస్’తో వేడెక్కిన రాజకీయం

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శల దాడి జరుగుతు న్న వేళ.. ఆయనకు బాసటగా నిలిచే నేతలెవరన్నది ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఆసక్తికర చర్చగా మారింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుండగా.. తాజాగా 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే ముఖ్యమంత్రికి మద్దతుగా బహిరంగంగా గళం విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఈ భేటీకి మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు దూరంగా ఉండటం కొత్త ప్రశ్నలకు తెరలేపింది. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖతోపాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరుస విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణను కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ  సమావేశంలో ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెంది న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కనిపించడం మరో కోణంగా మారింది. వీరితో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు మాత్రమే ఉన్నారు.

దీంతో సీఎం చుట్టూ ఏయే ప్రాంతాల నేతలు సమీకృతమవుతున్నారన్న దారిపైనా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే సమావేశానికి వచ్చిన వారి కంటే.. రాని వారి విషయంలోనే ఆసక్తి నెలకొం ది. ముఖ్యమంత్రిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్న తరుణంలో మొత్తం క్యాబినెట్, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా స్పందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాంటప్పుడు కొద్దిమంది మాత్ర మే సీఎంకు మద్దతుగా నిలవడం, మిగతా వారు మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

మరింత ఆజ్యం పోసిన ‘పరకాల’..

పరకాల నియోజకవర్గ అంశం కూడా వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు రాజకీయ వ ర్గాలు భావిస్తున్నాయి.  వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరడం, దీనిపై మంత్రి కొండా సురే ఖ కూతురు సుస్మిత వ్యతిరేకత వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయిటే టికెట్ల కేటాయింపు అనేది ఎవరి వ్యక్తిగత నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ప్రకటించడం మరో చర్చకు కారణమైంది.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో ఇప్పుడు అచ్చ కాం గ్రెస్, పచ్చ కాంగ్రెస్ చర్చ కూడా మొదలైంది. పార్టీలోని కొందరు సీనియర్లు సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడంపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బలహీనపర్చాలని బయటి పార్టీలతో పాటు సొంత పార్టీలోని కొం దరు నాయకుల కుట్ర ఉందని  ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాం శమైంది. 

అధిష్టానం కట్టడి చేసేనా?

ఇక ఇద్దరు, ముగ్గురు సీనియర్ మంత్రులు మొదటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాము నిర్వ హించే శాఖల్లో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పినట్లుగా వార్తలు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవల పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న వారిలో ప్రధానంగా ముగ్గురు నేతలున్నారు. ఉమ్మడి నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఇప్పుడు ఉమ్మడి వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఉన్నారు.

అందుకే శుక్రవారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు  అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పాల్గొన్నారని సీఎం రేవంత్‌రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అయితే వివాదం మరింత ముదురుతుందా? పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి కట్టడి చేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.