10 April, 2026 | 2:12 AM

కేంద్రంలో వచ్చేది మోదీ సర్కారే

07-05-2024 01:58 AM

ఎంపీగా బీబీపాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

జహీరాబాద్, మే 6: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గుణపాఠం తప్పదని గోషామహాల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ అన్నారు. జహీరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌కు మద్దతుగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మరోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి రానుందని, నరేంద్రమోదీ పీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. మోసపూరితమైన ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నాయకులను నిలదీస్తున్నారన్నారు. 

ఓడిపోతామనే భయం.. 

ఎన్నికల ముందు  ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సీఎం దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే  విధంగా నీచానికి దిగజారారని రాజాసింగ్ మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రుదేశాలు ఎంతో ఇబ్బంది పెట్టాయని, కానీ మోదీ ప్రధాని అయ్యాక పరిస్థితులు మారాయని, మన దేశం వైపు చూడాలంటే వణికిపోతున్నాయన్నారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ఎన్నికల ముందు ఆయా పార్టీల నేతలు చెప్పే బూటకపు మాటలు విని ప్రజలు మోసపోవద్దన్నారు. మరోసారి ఎంపీగా బీబీపాటిల్‌ను గెలిపించి నరేంద్ర మోదీకి బహుమతి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బీబీపాటిల్, జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షురాలు గోదవరి అంజిరెడ్డి, పార్టీ నాయకులు జైపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, సుదీర్‌బండారీ, ఊమకాంత్‌పాటిల్, దేశేట్టిపాటిల్ తదితరులు పాల్గొన్నారు.