హృఉదయ సముద్రం!
- లక్ష్యం లక్ష ఎకరాలు
క్షేత్రస్థాయిలో మాత్రం శూన్యం..
ఉదయ సముద్రం ఎత్తిపోతల దీనగాథ
నల్లగొండ జిల్లా రైతాంగం ఆశలపై నీళ్లు
కట్టంగూరు, ఏప్రిల్ 9 : నల్లగొండ జిల్లా రైతాంగం దశాబ్దాల కల.. బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం. అది ప్రస్తుతం ఒక అసంపూర్ణ ఘట్టంలా మిగిలిపోయింది. రిజర్వాయర్ కట్ట పూర్తయి.. నీళ్లు ఎత్తిపోసేందుకు మోటార్లు సిద్ధమైనా.. ఆ నీటిని పొలాలకు మళ్లీంచే కాల్వలు మాత్రం ఇంకా కాగితాలకే పరిమితమయ్యాయి. ఓవై పు ట్రయల్ రన్ విజయవంతమైందని ప్రకటనలు వస్తున్నా.. క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న కిలోమీటర్ల కొద్దీ కాలువ పనులు సా మాన్య రైతును వెక్కిరిస్తూనే ఉన్నాయి.
రిజర్వాయర్ నిండా నీళ్లు ఉన్నా.. పొలానికి పారే దారి లేక రైతన్న కళ్లు వాచిపోతున్నాయి. దాదాపు లక్ష ఎకరాల సాగునీరు, 127 గ్రామాలకు తాగునీరు అందించాలనే మహత్తర ఆశయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దు కుంది.
నల్లగొండ, నకిరేకల్, మునుగోడు వంటి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ఇది ఒక సంజీవని లాంటిది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. ప్రాజెక్టు గుండెకాయ లాంటి రిజర్వాయర్ కట్ట (3,665 కి.మీ.) పూర్తయి నా.. చేతులు లాంటి కాలువలు మాత్రం మొండిగానే మిగిలాయి. దీంతో ఈ ప్రాంత వాసులకు ఉదయ సముద్రం గుర్తుకు వచ్చినప్పుడల్లా వారి హృదయం సముద్రంగా మారుతుంది అనడం అతిశయోక్తి కాదు.
అంకెల్లో అసలు ’నిజం’ :
ప్రాజెక్టు పురోగతిని గమనిస్తే ఎడమ కాలువ పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నా.. కుడి కాలువ మాత్రం దారుణమైన జాప్యానికి గురవుతోంది. ఎడమ కాలువ 6.5 కిలోమీటర్లకు గాను 6.10 కి.మీ. పూర్తయ్యాయి. కేవలం 400 మీటర్ల పని పెండింగ్లో ఉండటం వల్ల 43 వేల ఎకరాలకు నీరందే అవకాశం చేజారిపోతోంది. కుడి కాలువ పరిస్థితి మరీ ఘోరమని చెప్పాలి. 25.50 కిలోమీటర్లకు కేవలం 9 కి.మీ. మాత్రమే పూర్తయ్యాయి.
అంటే ఇంకా 65 శాతం ప్రధాన కాలువ పని పెండింగ్లో ఉంది. పొలాలకు నీటిని తీసుకెళ్లే చిన్న కాలువల (డిస్ట్రిబ్యూటరీస్) పరిస్థితి మరీ అగమ్యగోచరం. 99.5 కి.మీ. పనులకు గాను కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. అయితే ఈ పనుల జాప్యానికి కారణాలు లేకపోలేదు. పాత ఒప్పందాల ప్రకారం పనులు చేయడం కాంట్రాక్టర్లకు భారంగా మారింది. పెరిగిన ముడిసరుకు ధరలతో పాత రేట్లకు పనులు సాధ్యం కావని వారు చేతులెత్తేశారు.
కొత్త రేట్లతో పనులు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్లను నియమించే ఫైలు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉంది. ట్రయల్ రన్ విజయవంతమైందని ప్రచారం జరుగుతున్నా, పంపిణీ వ్యవస్థ సిద్ధం కాకపోవడం ప్రణాళికా లోపాన్ని ఎత్తిచూపుతోంది.
ఎన్నాళ్లీ ఎదురుచూపులు.. :
ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే యంత్రాలు సిద్ధంగా ఉన్నా.. ఆ నీటిని పారించేందుకు కాలువలు సిద్ధంగా లేవు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న 8 మండలాల రైతులు ఎండకాలంలో సాగునీటి కోసం, తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. పెండింగ్లో ఉన్న ఫైళ్లను ఆమోదించి పనులు పూర్తి చేయిస్తేనే.. ఉదయసముద్రం ఆశయం నెరవేరుతుంది. లేదంటే అది నిరూపయోగంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వేగవంతంగా పనులు పూర్తి చేసి సాగు, తాగునీటి బాధలు తీర్చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
సాగు కష్టాలు తీరుతాయి
అనేక సంవత్సరాలుగా పంటల సాగుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. దశాబ్ద కాలంగా ఎత్తిపోతల పథకం కోసం ఎదురుచూస్తున్నాం. ఉదయ సముద్రం పూర్తి అయితే సాగునీరు అంధి ప్రతి ఎకరంలో సిరుల పంట సాగు అవుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు కూలీలకు ఉపాధి లభిస్తుంది.
శివ కుమార్, రైతు చెరువుగట్టు నార్కెట్ పల్లి మండలం




