ట్రాన్స్‌జెండర్లకు అండగా ఉంటాం
27-06-2024 12:05 AM
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూన్ 26(విజయక్రాంతి): ట్రాన్స్‌జెండర్లకు అన్ని విధాల అండగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లు డ్రైవింగ్ నేర్చుకుంటే ప్రైవేట్ బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో తగిన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే ట్రాన్స్‌జెండర్ల సంఘాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కోసం రుణాలు అందిస్తామని చెప్పారు. అనంతరం ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లను అందజేశారు. సమావేశంలో సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి పాల్గొన్నారు.






