13 July, 2026 | 1:20 AM

హిట్టింగ్ కోసమే దూబే

03-05-2024 01:36 AM

నలుగురు స్పిన్నర్లు కావాల్సిందే,  భారత కెప్టెన్ రోహిత్ 

ముంబై: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌నకు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై మేనేజ్‌మెంట్ పూర్తి క్లారిటీతో ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేయడంలో ఐపీఎల్  పాత్ర చాలా చిన్నదని వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టుపై అనుమానాలను నివృత్తి చేసేందుకు కెప్టెన్ రోహిత్, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లు గురువారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడు తూ..‘ జట్టు ఎంపికపై పెద్దగా మాట్లాడదలచుకోలేదు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టు సమతూకంగా ఉందని భావిస్తున్నా. ఇక జట్టులో నలుగురు స్పిన్నర్లు ఎందుకనే విషయంపై ఇప్పుడేం చెప్పలేను. కానీ కచ్చితంగా నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే. ఇద్దరు ఆల్‌రౌండర్లు కాగా.. మరో ఇద్దరు అటాకింగ్ స్పిన్ స్పెషలిస్ట్‌లు. ఇది జట్టును బ్యాలెన్సింగ్‌గా ఉంచుతుంది.

ప్రత్యర్థిని బట్టి తుది జట్టులో ఎవరు ఆడతారన్నది నిర్ణయిస్తాం. ఇక అమెరికా, విండీస్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో పిచ్ పరిస్థితులను, ప్రత్యర్థులను అంచనా వేసుకొని బరిలోకి దిగనున్నాం. టాపార్డర్ హిట్టింగ్ బాగానే ఉన్నప్పటికి మిడిల్ ఓవర్లలో హిట్టింగ్ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాం. దానికోసం కొన్ని వనరులను ఉపయోగించాలనుకున్నాం’ అని తెలిపాడు. మిడిల్ ఓవర్లలో భారీ షాట్లు ఆడేందుకు ఒక నిఖార్సైన ఆటగాడి కోసం చూశామని, అందుకే రింకూ స్థానంలో అతనికి చోటు లభించిందంటూ శివమ్ దూబేను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ కంటే ముందే 70 నుంచి 80 శాతం మేర జట్టు ఎంపిక జరిగిపోయిందని స్పష్టం చేశాడు. అయితే 15 మంది ఎంపిక కోసం ఐపీఎల్‌ను కొంతమేర మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపాడు. ఇక టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 2న ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో ఆడేందుకు భారత జట్టులోని తొలి బృందం మే 21 అమెరికాకు బయల్దేరి వెళ్లనుంది. ఐపీఎల్లో ప్లేఆఫ్‌కు చేరని జట్టులోని ఆటగాళ్లంతా ముందే అమెరికాకు చేరుకోనున్నారు.