13 July, 2026 | 2:18 AM

పాండ్యా ఎంపిక సరైనదే

03-05-2024 01:32 AM

ఇది కప్పు కొట్టే జట్టేనా? రింకూసింగ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు? హార్దిక్ పాండ్యా అవసరమా జట్టులో? రాహుల్,  గిల్‌ను ఎందుకు విస్మరించారు? సిరాజ్, అర్ష్‌దీప్ అమెరికా పిచ్‌లపై రాణించగలరా? జట్టులో నలుగురు స్పిన్నర్ల అవసరమేంటి?  

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపిక అనంతరం విమర్శకుల నుంచి వ్యక్తమైన ప్రధాన సందేహాలివి. వీటన్నీటికి బీసీసీఐ సెలెక్షకమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానాలిచ్చారు. కరీబియన్ పిచ్‌లపై స్పెషలిస్ట్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని హిట్‌మ్యాన్ అంటే.. పాండ్యాకు ప్రత్యామ్నాయం లేదని అగార్కర్ వెల్లడించాడు. ఆ వివరాలేంటో మీరూ చదివేయండి..

చీఫ్ సెలక్టర్ అగార్కర్,  రింకూకు అందుకే చాన్స్ దక్కలే

ముంబై: పొట్టి ప్రపంచకప్‌నకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక సరైనదేనంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమర్థించాడు. పాండ్యా స్థానాన్ని భర్తీ చేయడానికి తమకు మరో ఆల్‌రౌండర్ కనబడలేదని వ్యాఖ్యానించాడు. గాయంతో బాధపడుతున్నప్పటికి వరల్డ్‌కప్‌కు పాండ్యా ను ఎంపిక చేశారని విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో అగార్కర్  పాండ్యా ఎంపికను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.‘వైస్ కెప్టెన్సీపై ఎలాంటి చర్చ జరగలేదు. ఐపీఎల్లో ముంబై తరపున పాండ్యా అన్ని మ్యాచ్‌ల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ప్రపంచకప్ ఆడేందుకు కొంత సమయం ఉంది. ఒకవేళ పాండ్యా ఫిట్‌గా ఉంటే అతని స్థానంలో మరొక ఆటగాడి అవసరముండదు. లయ అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నప్పటికి దానిపై అతను వర్క్ చేస్తున్నాడు. ప్రపంచకప్‌లో కెప్టెన్ రోహిత్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ జట్టును బ్యాలెన్సింగ్ చేయగలడు’ అని పేర్కొన్నాడు.

కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయకపోవడానికి ఒక్కటే కారణమని అగార్కర్ తెలిపాడు. ‘రాహుల్ ఎంత మంచి ఆటగాడన్నది అందరికి తెలుసు. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయగల సమర్థుడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో తొలి ఐదు స్థానాలు ఇప్పటికే ఫిక్సయ్యాయి. ఆరో స్థానం కోసం సంజూ, రాహుల్ మధ్య పోటీ నెలకొంది. కానీ లోయర్ ఆర్డర్‌లో శాంసన్ రాణిస్తాడన్న నమ్మకంతో అతడికి అవకాశమిచ్చాం. ఇక ఎంత బెస్ట్ ప్లేయర్ అయినా 15 మందితోనే జట్టును ప్రకటించాలి. బ్యాటర్లతోనే జట్టును నింపలేం. జట్టు విజయాల్లో బౌలర్ల పాత్ర కూడా కీలకం. 15 మందిలో ఒక అదనపు బౌలర్ కావాలి. అందుకే రింకూ, గిల్ లాంటి ప్లేయర్లకు జట్టులో చోటు దక్కలేదు. ఇది కఠిన నిర్ణయమే కానీ కాదనలేని స్థితి’ అని వెల్లడించాడు. నిరుడు వన్డే ప్రపంచకప్ అనంతరం పాండ్యా జాతీయ జట్టు తరఫున ఆడని విషయం తెలిసిందే. ఐపీఎల్లో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యా జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమవుతున్న విషయం తెలిసిందే.