8 June, 2026 | 1:21 AM

ఏడాదిలోపు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

08-06-2026 12:00 AM

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, జూన్ 7 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఏడాదిలోపు నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఆదివారం  గొల్లపల్లి మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, కల్యాణ లక్ష్మి చెక్కులను  పంపిణీ చేశారు.  గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు గ్రామంలో రూ.  7.65 లక్షలతో పెద్ద చెరువు తూము మరమ్మత్తు పనులకు మంత్రి అడ్లూరి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వ పాలనలో అనేక సాగు నీటి ప్రాజెక్టు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేయకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని  అన్నారు. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 1,000 కోట్లు అవసరమని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అంగీకరించినట్లు మంత్రి  తెలిపారు. నియోజకవర్గంలోని పత్తిపాక రిజర్వాయర్, అక్కపల్లి లిఫ్ట్, మేడారం రిజర్వాయర్ నుండి కొత్తపల్లి వరకు కాలువ పనులతో పాటు మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తి చేస్తామని అన్నారు. 

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాపల్లి గంగన్న,  మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ తో పాటు నాయకులు నిశాంత్ రెడ్డి, సర్పంచుల పోరం అధ్యక్షులు దాసరి తిరుపతి గౌడ్ తో పాటు  సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.