8 June, 2026 | 1:48 AM

‘ఆమె.. ఒక విజేత’ పుస్తకాన్ని ఆవిష్కరించిన జేడీ లక్ష్మీనారాయణ

08-06-2026 12:00 AM

ఖైరతాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ప్రముఖ రచయిత్రి పింగిలి కవితారెడ్డి రచించిన ‘ఆమె.. ఒక విజేత‘ పుస్తకాన్ని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జేడీ ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జేడీ లక్ష్మీనారాయణతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. పింగిలి కవితా రెడ్డి తాజాగా రచించిన ఆమె.. ఒక విజేత పుస్తకంతో పాటు గతంలో రచించిన తొలి అడుగు, అంతరంగాలు.. అనంతరంగాలు పుస్తకాలను కూడా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురించినట్లు తెలిపారు. మనిషిలోని భావాలను ప్రకటించడానికి చాలా మాధ్యమాలు ఉన్నాయని, రచయిత్రి కవితా రెడ్డి వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. 

డాక్టర్ అనంతలక్ష్మి మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలతో పాటు.. వాటిని అధిగమించి ఎలా విజేతలుగా నిలవాలో ఈ పుస్తకంలో కవితారెడ్డి పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ప్రతినిధు లు నాగ మోహన్, సుప్రియ, అరుణ, సాయి, దేవిక, రాజు, దేవేందర్, నరేష్, ఛాయాదేవి, రోషిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.