8 June, 2026 | 1:44 AM

డంపింగ్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలి

08-06-2026 12:00 AM
  1. స్థానిక ఎమ్మెల్యే వాస్తవాలను దాచి పెడుతుండు
  2. జీవో 20 వెంటనే రద్దు చేయాలి
  3. బండ రావిరాల సర్పంచ్ విజయకుమార్ డిమాండ్ 

అబ్దుల్లాపూర్మెట్, జూన్ 7: అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధి బండరావిరాల గ్రామంలోని సర్వే నెంబర్ 268లో ప్రతిపాదించిన 494 ఎకరాల భారీ డంపింగ్ యార్డ్ (ఎకో టౌన్) ప్రాజెక్ట్ను వెంటనే రద్దు చేయాలని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆదివారం బండరావిరాల సర్పంచ్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కొహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ శంకుస్థాపన సభలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

కొహెడలో జరిగిన సీఎం సభలో ఎమ్మెల్యే బండరావిరాల గ్రామం పేరు కూడా ప్రస్తావించకుండా, డంపింగ్ యార్డ్ అంశాన్ని ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంగా చిత్రీకరించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. అధికారిక ఉత్తర్వుల ప్రకారం బండరావిరాల సర్వే నెంబర్ 268లో 494 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్ట్ ప్రతిపాదించబడిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని విజయ్ కుమార్ పేర్కొన్నారు.  ఇంకా ఏమీ కాలేదు& ప్రజలు అధైర్యపడొద్దు అని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని సర్పంచ్ అన్నారు. ముఖ్యమంత్రి సభ ప్రారంభానికి కొన్ని గంటల ముందే టీజీఐఐసీ అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారని చెప్పారు.

విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు వారితో మాట్లాడేందుకు వెళ్లగా, అధికారులు ప్రజలను చూసి దొడ్డి దారిలో వెళ్లిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ 20 జారీ చేయడంతో పాటు జపాన్కు చెందిన కిటాక్యుషు సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న దృశ్యాలు, ఫోటోలు ప్రజల ముందే ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్పై ఎలాంటి చర్యలు జరగలేదని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని మండిపడ్డారు.

బం డరావిరాల ప్రజలు ఇప్పటికే పరిసర ప్రాం తాల్లోని క్రషర్ల వల్ల తీవ్రమైన ధూళి, శబ్ద కాలుష్యాన్ని భరిస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలోని చెత్తను తీసుకొచ్చి గ్రామ పరిసరాల్లో డంప్ చేయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనన్నారు.ఇంత పెద్ద వివాదాస్పద ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక కారణం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తే తీవ్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఎమ్మెల్యేకు చట్టాలు, నిబంధనలపై పూర్తి అవగాహన ఉన్నందున నిజంగా ప్రజల పక్షాన ఉంటే వెంటనే జీవో నెంబర్ 20ను రద్దు చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంతానికి చెందిన 15 గ్రామాల ప్రజలంతా కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామాల భవిష్యత్తును బలి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్తో పాటు ఉప సర్పంచ్ దూస శంకర్, వార్డు సభ్యులు కన్నె భరత్ , ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనూష ప్రవీణ్, యువ నాయకులు గుండ్ల సతీష్ , ఏర్పుల నరేష్, రమేష్,  శ్రీకాంత్ గౌడ్,  కరుణ్ తదితరులు పాల్గొన్నారు.