21 May, 2026 | 2:39 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం

21-05-2026 12:59 AM

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ మే 20 (విజయ క్రాంతి)స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, జిల్లాలో చేపట్టనున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ వివరాలను సమగ్రంగా వివరించారు. జూన్ 25 వ తేదీ నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. బూత్ లెవెల్ అధికారులు (బిఎల్‌ఓ లు) ఓటర్ల వివరాలకు సంబంధించి ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారం లు ఇస్తారని అన్నారు.

ఓటర్లు నింపిన వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారం లు జూలై 24 తేదీ వరకు తిరిగి తీసుకుంటారు అని వివరించారు. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారంలు ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో కూడా సమర్పించవచ్చునన్నారు. వివరాల పరిశీలన తర్వాత, ఎస్‌ఐఆర్ కి సంబంధించి, జూలై 31 వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ లో ఓటరు పేరు లేకపోతే తగిన ఆధారాలతో సంబంధిత ఫామ్ లను నింపి, ధ్రువీకరణ (డిక్లరేషన్) తో ఈఆర్‌ఓ లను సంప్రదించవచ్చునని చెప్పారు.

డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా తెలుపవచ్చునని స్పష్టం చేశారు. వివరాల పరిశీలన తర్వాత, అక్టోబర్ ఒకటవ తేదీన తుది ఎలక్టోరల్ రోల్ జాబితా ప్రదర్శిస్తామని వివరించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరుపున బూత్ లెవెల్ ఏజెంట్ (బిఎల్‌ఎ) లను నియమించాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా తమ ఓటు హక్కు కోల్పోకుండా, పారదర్శకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులకు నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలలో సమావేశాలు నిర్వహించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని తెలిపారు.అనంతరం తహసిల్దార్ లు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏఈఆర్‌ఓ లు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిం చాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఖానాపూర్ ఈఆర్‌ఓ గంగాధర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసిల్దార్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.