5 August, 2026 | 12:38 AM

ఉచిత చేప పిల్లల పథకం కొనసాగిస్తాం

05-08-2026 12:00 AM

పెండింగ్ బకాయిల విడుదలకు కృషి

పాఠశాలల మధ్యాహ్నా భోజనంలో చేపలు?

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ -మంత్రి వాకిటి శ్రీహరి 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించడంతోపాటు మత్స్యకారులకు సంబంధించిన పెండింగ్ బకాయిల విడుదలకు ప్రత్యేక కృషి చేస్తామని, విద్యార్థుల పోషకాహారాన్ని మరింత మెరుగుపరిచే దిశగా మధ్యాహ్న భోజన పథకంలో చేపలను చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపారిశ్రామికాభివృద్ది శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు నెలకొన్న సహకార సంఘాల సభ్యత్వ వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,, రాష్ట్రంలోని 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని మరింత విస్తరించడంతో పాటు మత్స్యకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్, మోపెడ్లు, రిటైల్ అవుట్‌లెట్ షాపుల ఏర్పాటు కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. 

ప్రతి మూడు నెలలకోసారి జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షిస్తామని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ కోహెడలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా చేపల విక్రయాలు, పంపిణీకి అవకాశం ఏర్పడుతుందన్నారు. మత్స్యకారులకు సంబంధించిన రూ.1.34 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ చేసిందని తెలిపారు. మత్స్యసహకార సంఘాల అధ్యక్షులకు ప్రోటోకాల్ అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు.