21-11-2025 12:00:00 AM
ఇసుక ట్రాక్టర్లకు అడ్డుగా వాగు ప్రదేశంలో కందకాల ఏర్పాటు
విజయక్రాంతి వార్తా కథనానికి స్పందించిన తహసీల్దార్
కల్వకుర్తి, నవంబర్ 20 : ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ఇసుకను తరలించే ఇసుక మాఫియా పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి తాసిల్దార్ ఇబ్రహీం స్పష్టం చేశారు. గురువారం విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన ’అనుమతుల పేరుతో అక్రమ ఇసుక దందా’ అనే వార్తా కథనాన్ని పరిశీలించారు. అనుమతుల పేరు చెప్పి అక్రమంగా ఇసుకను తోడేస్తున్న ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, రవాణా చేయడం పూర్తిగా నిషేధితమని, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు వాగు వద్ద ట్రాక్టర్లు రాకపోకలు నిలిపివేయడానికి ప్రత్యేకంగా కందకాలు తీయించారు. మునుముందు ఎలాంటి పనులకు ఇక్కడి నుండి అనుమతులు లేవని స్పష్టం చేశారు.