యువతకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత పెంచుతాం
కాంగ్రెస్ యూత్ స్టేట్ ఇంచార్జి భవ్య
సూర్యాపేట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పదవుల్లో యువతకు మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని తెలంగాణ యూత్ స్టేట్ ఇంచార్జ్ భవ్య పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతానికి యువత కీలక శక్తిగా నిలుస్తుందన్నారు. యువతకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, ఈ అంశాన్ని ఉన్నత స్థాయి నాయకత్వం ముందు ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు.యువతలో ఉన్న ఉత్సాహం, ఆలోచనా శక్తి, నాయకత్వ లక్షణాలు పార్టీని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి, వారికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసే ప్రతి యువకుడికి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సూచిస్తామని తెలిపారు.తదుపరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేట్ అభినయ్ మాట్లాడుతూ* యువతకు అవకాశాలు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పొన్నం తరుణ్, జిల్లా ఇన్చార్జీలు సురేష్, రమ్యకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రావ్య, కుక్కడప్పు మహేష్, జావిద్ బేగ్, బొడ్డు సాయి తదితరులు పాల్గొన్నారు.






