లక్షాధికారులను చేస్తాం

08-05-2024 12:15:18 AM

ఏటా మహిళలకురూ.లక్ష జమ 

ఉపాధి హామీ కింద రోజువారీ వేతనం రూ.400

ఆశా వర్కర్లు,అంగన్‌వాడీల వేతనం రెట్టింపు

బీజేపీ ఆదివాసీలకు ఇళ్లు లేకుండా చేస్తుంది

వారికి మీరు అభివృద్ధి చెందడం నచ్చదు

ఝార్ఖండ్ ఎన్నికలర్యాలీలో రాహుల్ గాంధీ

రాంచీ, మే 7: తాము అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ఏటా రూ.లక్ష బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.అలాగే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద రోజు వారీ వేతనం రూ.400 ఇస్తామని, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీల వేతనాల ను రెట్టింపు చేస్తామని వెల్లడించారు. మంగళవారం ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్ భూమి జిల్లా చైబాసాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. బీజేపీ కొందరు ధనవంతులకు కోట్ల రూపాయలు ఇస్తే.. తాము మాత్రం కోట్లాది మంది పేదలను లక్షాధికారులను చేస్తామని, వారి జీవితాలను మారుస్తామని చెప్పారు. ఆదివాసీల జల్, జంగిల్, జమీన్‌కు భద్రత కల్పించే బాధ్యత తనదని పేర్కొన్నారు. దేశంలోని సహజ వనరులపై తొలి హక్కు ఆదివాసీలదేనని వ్యాఖ్యానించారు. ‘మేం ఆదివాసీలు అని పిలుస్తున్నాం. వారు (బీజేపీ) వనవాసీలు అని పిలుస్తున్నారు. అలా పిలవడం మిమ్మల్ని అవమానించినట్టే. వనవాసీ అం టే అడవుల్లో నివసించే వారని అర్థం. మీరు వనవాసీలు కాదు.. ఆదివాసీలు. మీరు అడవుల్లో నివసించే వారు కాదు.. జల్, జంగిల్, జమీన్‌పై మొదటి అధికారం ఉన్న వాళ్లు మీరు’ అని భావోద్వేగంతో రాహుల్ చెప్పారు. ‘వారికి మీరు అభివృద్ధి చెందాలని అనుకోరు. మీరు పెద్ద నగరాల్లో వాళ్లిళ్లల్లో పని చేయాలని అనుకుంటారు. మీ పిల్లలు ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు కావడం వారికి ఇష్టం లేదు. అదీ బీజేపీకి, ఇండియా కూటమికి మధ్య ఉన్న బేధం’ అంటూ బీజేపీపై దుయ్యబట్టారు.

అదానీ, మోదీ లక్ష్యం అదే..

‘అదానీ లాంటి వాళ్లకు అడవులను అమ్మేసి.. ఆదివాసీలకు వాళ్ల ఇళ్లు లేకుండా చేస్తారు. వాళ్ల ఇళ్లల్లోనే పనిచేసేలా బలవంతం చేస్తారు. లేదంటే రోడ్లపై యాచించి జీవించేలా చేస్తారు’ అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చించేసి.. ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకోవాలనేదే ప్రధాని మోదీ, అదానీల లక్ష్యమని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటిది  ఇండియా కూటమి జరగనివ్వబోదని చెప్పారు. రాజ్యాంగం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాజ్యాంగం అనేది పుస్తకం కాదని, ఇది ప్రజల గొంతుక అని, ఇలాంటి దాన్ని చించేస్తానంటూ బీజేపీ నేతలు చెప్పడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ‘ఇదే రాజ్యాంగం మీకు రిజర్వేషన్లు ఇచ్చింది. ఉపాధి, ఉద్యోగం కల్పించింది. మీ పిల్లలకు చదువు నేర్పించింది. మంచి దవాఖానాల్లో చికిత్స పొందే వెసులుబాటు కల్పించింది. ఇక దీన్ని నాశనంచేస్తే ఆదివాసీలు లేకుండా పోతారు. దళితులు, ఓబీసీలు కనిపించరు. అంతా వెయ్యి మంది ధనవంతుల చేతుల్లోకే వెళ్లిపోతుంది’ అని మండిపడ్డారు.