ముస్లిం రిజర్వేషన్లకు మా పార్టీ అనుకూలం

08-05-2024 12:11:53 AM

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం

బీహార్, మే 7 (విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం రిజర్వేషన్ల చుట్టే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రిజర్వేషన్లపై మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను తొలిగించే ప్రయత్నం చేస్తోందని, ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లకు తమ పార్టీ అనుకూలమని పేర్కొన్నారు. మతాన్ని చూపి రిజర్వేష న్లను తొలిగించడం సరైన పద్ధతి కాదన్నారు. రిజర్వేషన్లను సామాజిక కోణంలో తప్ప మతం కోణంలో చూడకూడదన్నారు. మం డల్ కమిషన్ సైతం సామాజిక కోణంలో రిజర్వేషన్లు కల్పించాలని తన నివేదికలో పేర్కొన్నట్లు గుర్తు చేశారు.

కాగా, మూడో దశ ఎన్నికల తర్వాత పరిస్థితులు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. ఎన్‌డీఏ కూట మికి 200 సీట్లు కూడా దాటే అవకాశం లేనప్పటికీ, ప్రజల దృష్టి మరల్చడానికి 400 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. తాము ముస్లింలకు రిజర్వేషన్ ప్రయోజనాలను వర్తింప జేయడానికి అనుకూలంగా ఉన్నామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు తొలగించాలని చూస్తోందని ఆరోపించారు. ఇండి యా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో మార్పులు చేసి మైనార్టీ రిజర్వేషన్ శాతాన్ని పెంచుతుందని బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.