11 August, 2026 | 4:34 AM

సొంతింటి కలను సాకారం చేస్తాం

11-08-2026 12:00 AM
  1. మంత్రి పొంగులేటి 
  2. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో 394 ఇళ్ల పంపిణీ
  3. హాజరైన మంత్రి పొన్నం
  4. పొంగులేటితో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వాగ్వాదం

హనుమకొండ/కరీంనగర్ (మహబూబాబాద్), ఆగస్టు 10 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని నిర్మిం చి వారి కలను సాకారం చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు 394 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, నాయిని రాజేం దర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గతంలో వివిధ దశల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను కూడా పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతే..  ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నామని అన్నారు. కాగా హనుమకొండ బాలసముద్రం కాలోజీ కళాక్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రైతు మేళాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఖండన

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేసిందని, తాము పూర్తి చేసేందుకు నిధులు కేటాయించామని పొంగులేటి అనడంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తప్పుపట్టారు. కమలాపూర్ మండలంలో ఇండ్లు కట్టింది కేసీఆర్ ప్రభుత్వమని, ఇప్పుడు ప్రారంభించిన ఇండ్లు కూడా కేసీఆర్ కట్టించినవేనని, రాజకీయాలు చేయొద్దని, వాస్తవాలు ప్రజలకు వివరించాలని మంత్రి వ్యాఖ్యలపై ఎదురుదాడి చేయడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఆందోళనకు దిగడంతో గందరగోళం చెలరేగింది. పోలీసులు కలగచేసుకుని శాంతింపజేశారు.