09-02-2026 12:34:26 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): శ్రీరాంసాగర్ రెండో దశను ఆధునికరించి సూర్యాపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన బహిరంగ సభకు ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినడానికి ప్రజలు విముఖత చూపడంతో పక్క దారి పట్టి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు.
తాము ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతీ నియోజకవర్గానికి 3వేల ఇల్లు మంజూరు చేసిందన్నారు. ధాన్యం దిగుబడిలోనే కాదు కొనుగోలులోనూ రాష్ర్టం ఆల్ టైం రికార్డ్ నమోదు చేసిందన్నారు. ఈ వానాకాలం సీజన్ లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే ప్రభుత్వం రైతుల నుండి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.
ప్రజా ప్రభుత్వం చేస్తున్న పనులను గమనిస్తున్న ప్రజలు పురపాలక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు. సమన్వయంతో పనిచేస్తే సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో విజయం సాదించేది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనే నన్నారు. అన్ని వర్గాలు కాంగ్రెస్ కి మద్దతుగా నిలబడుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, చకిలం రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.