శక్తివిభాగంలో పాలిటెక్నిక్ విలీనానికి ఒప్పుకోం
- జీవో 97ను వెనక్కి తీసుకోవాలి
- తెలంగాణ పాలిటెక్నిక్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్‌ను శక్తి (స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్) డిపార్ట్‌మెంట్‌లో విలీనం చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.97ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ పాలిటెక్నిక్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. పాలిటెక్నిక్ విభాగంలోని టీచింగ్, నాన్‌టీచింగ్ కలిపి మొత్తం 16 సంఘాలు ఆదివారం మాసాబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో సమావేశమై టీపీజేఏసీగా ఏర్పాటయ్యాయి. జేఏసీ చైర్మన్‌గా నాగరాజు, కన్వీనర్‌గా సురేష్, సెక్రటరీ జనరల్‌గా శ్రవణ్ కుమార్, శ్రీరామ్, కోజైబౌచైర్మన్‌గా సౌజన్య, సునీతను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ శక్తి డిపార్ట్‌మెంట్ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికింద ఎస్‌బీటీఈటీ (స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) నిధులు వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పీపీపీ మోడ్‌లో నడిచే వ్యవస్థ కింద తాము పనిచేయడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు, అధికారులకు తెలియకుండా ప్రభుత్వం విలీన ప్రతిపాదనను క్యాబినెట్‌లో ఆమోదించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై తమ ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.






