17 August, 2026 | 3:36 AM

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి

17-08-2026 02:25 AM

అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్(టీజీ సేఫ్) కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2005 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అవినాశ్ మహంతి.. ప్రస్తుతం తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్నారు.

ఇటీవల ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లను విలీనం చేసి ‘టీజీ సేఫ్’ పేరిట ఏకీకృత పరిపాలనా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థకు కమిషనర్‌గా ఉన్నతాధికారికి సమగ్ర పరిపాలనా నియంత్రణ కల్పించింది. ఈ క్రమంలో ఈ నెల 4న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అవినాశ్ మహంతిని తెలంగాణకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా నియమిచింది. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో టీజీ సేఫ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.