12 March, 2026 | 10:50 AM

ఆరోగ్యానికి హాని కలిగించే మిల్లు మాకొద్దు

12-03-2026 12:21 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి11: ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే రైస్ మిల్లు తమ ప్రాంతంలో నిర్మించోద్దని, జనావాసాల్లో మిల్లును ఏర్పాటు చేయడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడి శ్వాసకోస వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని రైస్ మిల్లు ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దని గ్రామస్తులు, రైతులు కోరారు.

పూర్తి వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామం,ఆ గ్రామ ఆవాస గ్రామమైన జ్యోతుల నగర్ సమీపంలోని సర్వే నెంబర్ 381,382లో పార్ బాయిల్ రైస్ మిల్లు ఏర్పాటుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వ అనుమతి కోరుతున్నారన్న సమాచారంతో ఆ గ్రామస్తులు,సమీప రైతులు అట్టి మిల్లు ఏర్పాటుకు అనుమతించొద్దని బుధవారం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరిండెంట్ రామకృష్ణకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు రైతులు మాట్లాడుతూ రైస్ మిల్లు ఏర్పాటు జరిగితే అధిక శబ్ద కాలుష్యం,గాలిలో దుమ్ము వ్యాప్తి,లారీలు,ట్రాక్టర్లతో ఎక్కువ రాకపోకలు జరగడం వలన అనేక సమస్యలు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ఇట్టి రైస్ మిల్లు నిర్మాణ ప్రదేశానికి సమీపంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించిన సూర్యదేవాలయం ఉండడంతో ఆలయానికి వచ్చే భక్తులకు ఆటంకం కలుగుతుందని అన్నారు.

ఈ రైస్ మిల్లు ఏర్పాటుతో మిల్లు నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల ప్రజల ఆరోగ్యంపై,భూగర్భ జలాలపై,పంట పొలాలపై ప్రతికూల ప్రభావం పడటమే కాక చిన్నపిల్లలు,వృద్ధులు,మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.పర్యావరణానికి హాని కలిగించే రైస్ మిల్లుకు అనుమతులు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతులు కొణతం వెంకట్రాంరెడ్డి,జ్యోతుల సత్తయ్య,జ్యోతుల కాంతారావు,తండ లింగమూర్తి,వేములకొండ ఉప్పలయ్య,గడ్డం శ్రీనివాస్,కొనతం నృపిన్ రెడ్డి,నరేష్,పాలెల్లి సంజీవ,అన్నపూర్ణ,వీరయ్య,జీడి వెంకటయ్య,కునుకుంట్ల మల్లయ్య,యాదయ్య,వెంకట్రావు తదితరులు ఉన్నారు.