18 August, 2026 | 3:52 AM

వరి సాగుకు నీరివ్వం

18-08-2026 12:00 AM

ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఆగస్టు 17 (విజయక్రాంతి) : ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో కురియాల్సినంత వర్షం కురియకపోవడంతో గ్రౌండ్ వాటర్ లెవల్ లు కిందికి పడిపోయాయని, ప్రాజెక్టుల నుంచి వరి సాగుకు నీరివ్వడం కుదరదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్.ఈ. విష్ణు ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎల్తూరి సురేఖలతో కలిసి మాట్లాడారు.

రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని మొదటి ప్రాధాన్యతగా తాగునీటి అవసరాలకు వినియోగించాల్సిన పరిస్థితి ఉందని, గొల్లవాగు ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులలోనూ వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉండే అవకాశం లేదన్నారు. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో సుమారు 3 నుంచి 4 ఎకరాలలో ఆరు తడి పంటలను సాగు చేయవచ్చని సూచించారు.

ప్రస్తుత పరిస్థితులలో రైతులు వరి నాట్లు వేస్తే పంటకు అవసరమైన నీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో పంట ఎండిపోయే ప్రమాదం ఉందని, దీనితో దిగుబడి తగ్గడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, అలసందులు తదితర తక్కువ నీటితో సాగయ్యే పంటలను రైతులు ఎంచుకోవాలని, ఈ పంటలకు అవసరమైన మేరకు నీటిని అందించగలిగే అవకాశం ఉన్నందున పంటలు విజయవంతంగా సాగయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను కూడా అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నీటి లభ్యత, వర్షపాతం విషయంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం అవసరమన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలంటే వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలని సూచించారు.