అధికారులను సస్పెండ్ చేసే దాకా వదలం.. తాడో పేడో తేల్చుకుంటా
ఆమరణ నిరాహారణ దీక్షకూ సిద్ధం
ఉడుం పట్టు పట్టిన చుంచు రామకృష్ణ
తుడుందెబ్బ జిల్లా కమిటీ సంఘీభావం
గుండాల, (విజయక్రాంతి): మండల పరిధి ముత్తాపురం గ్రామ సమీపంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సీయల్ స్కూల్(Eklavya Model Residential School) లో ఆదివాసీ విద్యార్థులపై వివక్ష వేధింపులకు నిరసనగా ఆదివాసీ తొమ్మిది తెగల చైర్మన్ చుంచు రామకృష్ణ గత మూడు రోజులుగా ఆ పాఠశాల ముందు నిరాహార దీక్షను చేపట్టారు. ఏకలవ్య మోడల్ స్కూల్ ఐటీడీఏ అధికార యంత్రాంగంపై ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకుడు చుంచు రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న సదరు అధికారులను సస్పెండ్ చేసేంత వరకూ తన పోరాటాన్ని ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. "తాడో పేడో తేల్చుకుంటా" అంటూ అధికారుల తీరుపై ఆయన ఉడుం పట్టు పట్టారు. గిరిజన ప్రాంతాల్లో లేదా సంబంధిత శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిని విధుల్లోంచి తొలగించే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.
చుంచు రామకృష్ణ చేస్తున్న ఈ పోరాటానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం-ఖమ్మం జిల్లా కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది. జిల్లా కమిటీ నాయకులు దారబోయిన రమేష్, బచ్చలి వెంకటేశ్వర్లు, కల్తి రామ్ ప్రసాద్, కోరెం కృష్ణ ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం, న్యాయం కోసం రామకృష్ణ చేస్తున్న పోరాటంలో తామంతా భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు. అధికారులు స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తుడుందెబ్బ నేతలు హెచ్చరించారు. నిర్లక్ష్యంగా, అక్రమంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, బాధితులకు తక్షణమే పూర్తిస్థాయిలో న్యాయం చేకూరాలని, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించకుంటే ఏ క్షణమైనా ఆమరణ నిరాహార దీక్షకు దిగడం ఖాయమని చుంచు రామకృష్ణ ఏకలవ్య పాఠశాల ముందు భీష్మించుకు కూర్చున్నారు.






