అభివృద్ధి పేరిట విధ్వంసమంటే ఊరుకోం
- మూసీ ప్రాజెక్టు బాధితులకు బీఆర్‌ఎస్వీ నాయకుల భరోసా
- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ అభివృ ద్ధి పేరిట విధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మూసీ పోరుబాట పేరిట భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) తలపెట్టిన యాత్ర శనివారం తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక వాహనాలకు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు పది రోజుల పాటు జరిగే యాత్రలో యాభై బృందాలుగా విడిపో యి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇస్తారని తెలిపారు. మూసీ సుందరీకరణ పేరిట పేదలపై రేవంత్ ప్రభుత్వం జరుపుతున్న దమనకాండపై పోరాడేందుకు విద్యార్థులు నడుం బిగించడం హర్షించదగ్గ విషయమన్నారు. మూసీ తీరాన ప్రజలు భయాందోళనల్లో ఉన్నారని, అధికా రం ఉంది కదా అని ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్వీ బృందాలు ప్రజల్లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ దోపిడీ ఆలోచనలను వివరిస్తాయని వెల్లడించారు. అందరితో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే లక్షలాది మంది తో ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామన్నారు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు మూసీపై తమ కార్యాచరణ కొనసాగుతుందని బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, విద్యార్థి విభాగం పాల్గొన్నారు.




