28 July, 2026 | 1:08 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం

03-06-2026 04:11 PM

- బీఆర్ఎస్ యువజన నాయకులు

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్పష్టమైన నిధుల ప్రకటన చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌ కర్నూల్ జిల్లా పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటామని బీఆర్ఎస్ విద్యార్థి, యువజన నాయకులు హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, రైతుబంధు వంటి పథకాలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం ప్రభుత్వం కావాలనే పనులను ఆలస్యం చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి సాగునీరు అందడంతో పాటు వలసలు తగ్గుతాయని, అయితే కాంగ్రెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన అభివృద్ధి కోసం కాదని, రాజకీయ ప్రదర్శన కోసమేనని విమర్శించారు.

ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయి నిధులు కేటాయించి, పనుల పూర్తి గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయిస్తుందో స్పష్టంగా ప్రకటించిన తర్వాతే జిల్లాలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. రైతాంగానికి నిలిచిపోయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ విష్ణు, నాయకులు వంశీ, గఫూర్, జానకిరామ్, నరేష్, ప్రశాంత్, బాలు సాగర్ తదితరులు పాల్గొన్నారు.