16-10-2025 12:00:00 AM
జాతర ఏర్పాట్లపై పరిశీలన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే స్థానిక నాయకులు, అధికారులతో కలిసి జాతరలో జరిగే అభివృద్ధి పనులు, జాతర ఏర్పాట్లపై పనులను పరిశీలించి మాట్లాడారు.
మండలం లోని తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న కొండలపై స్వయంభుగా వెలసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారు నియోజక వర్గ ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్నారని అన్నారు. ప్రతి యేడు నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమికి 5 రోజుల పాటు జరిగే శ్రీ బుగులోని జాతరకు లక్షలాది మంది తరలి వస్తారని వారికి జాతరలో అన్ని సౌకర్యాలు కల్పించేలా రు.5.50 కోట్లతో జగ్గయ్యపేట నుండి బుగులోని జాతర,
తిరుమలగిరి నుండి బుగులోని జాతర, పాండవుల గుట్ట నుండి బుగులోని జాతర వరకు రోడ్డు నిర్మాణాలు చేపట్టామని ఫారెస్ట్ అధికారులతో పాండవుల గుట్ట నుండి జాతర రోడ్డుకు కొంత ఇబ్బందులు కలిగిన త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.అలాగే జాతరలో రూ.2 కోట్లతో స్నానాల గుండం, మంచినీటి బావి, కొండపైకి మెట్ల వెడల్పు, భక్తులకు విశ్రాంతి గది, కళ్యాణ మండపం,
కళ్యాణ కట్ట, మహిళల స్నానపు గదులు, మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, స్తంభం చెట్టు చుట్టూ సీసీ, గండ దీపం పైకి 30 మీటర్ల మెట్లు,తదితర అభివృద్ధి పనులు ఈ జాతరకు పూర్తయ్యేలా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు. జాతరకు భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక సిఐ కర్ణాకర్ రావు,రేగొండ ఎస్త్స్ర రాజేష్ భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, ఎన్ ఎస్ ఆర్ సంస్థల అధినేత సంపత్ రావు, పిఎసిఎస్ చైర్మన్ నడిపెళ్లి విజ్జన్ రావు, బుగులోని జాతర చైర్మన్ గంగుల రమణారెడ్డి,తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్,మాజి చైర్మన్ రొంటాల వెంకటస్వామి,జాతర అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు కట్ల మధుసూదన్ రెడ్డి, ఆకుతోట తిరుపతి,ధర్మకర్త మామిడాల సందీప్, తిరుమలగిరి గ్రామ శాఖ నాయకులు మంతెపూరి తిరుపతి, అశోక్, సిరంగి సతీష్ పాల్గొన్నారు.