6 June, 2026 | 1:05 PM

ఫ్యూచర్ సిటీ భూబాధితులకు అండగా ఉంటాం

06-06-2026 11:58 AM

రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షులు వి. హన్మా నాయక్

​ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్‌తో భేటీ.

న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదు!

రంగారెడ్డి, జూన్ 6(విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయిన గిరిజన రైతులకు సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వంతో అన్ని రకాల పోరాటాలు చేస్తామని, బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షులు వి. హన్మా నాయక్ స్పష్టం చేశారు. దిల్‌సుఖ్‌నగర్ గెస్ట్ హౌస్‌లో గల రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ఛాంబర్‌లో ఫ్యూచర్ సిటీ భూబాధిత రైతులతో కలిసి ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హన్మా నాయక్ గిరిజన రైతుల పక్షాన నిలిచి, వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఎస్టీ కమిషన్ మెంబర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు తక్షణమే పూర్తి స్థాయి న్యాయం చేకూర్చాలని ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.భూములు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితిలో ఉన్న గిరిజన రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు గిరిజన సేవా సంఘం బాధితుల వెన్నంటి ఉంటుందన్నారు.

​రైతులకు భరోసా....

ఎస్టీలకు, గిరిజన రైతులకు చట్టప్రకారం దక్కాల్సిన పరిహారం, హక్కులు పూర్తిగా లభించేలా ప్రభుత్వంతో పోరాడుతామని హన్మా నాయక్ ఈ సందర్భంగా రైతులకు గట్టి భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, న్యాయ పోరాటంలో గిరిజన సేవా సంఘం ఎల్లప్పుడూ మీ తోడుగా, మీ అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.