సింగరేణి హైస్కూల్లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ఇల్లందు ఏరియా
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా సింగరేణి హైస్కూలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కల నాటకం, పర్యావరణ ప్రతిజ్ఞ, ర్యాలీ కార్యక్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యకమానికి ఏరియా ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ సతీష్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. ఫుల్ సింగ్ హాజరైనారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డి.ఫుల్ సింగ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పర్యావరణ ప్రతిజ్ఞ చేయించి, పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని సంకల్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంపొందించడంతో పాటు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తరువాత డి. ఫుల్ సింగ్, యాన్.సతీష్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం జేకే కాలనీ నుంచి ఫైర్ స్టేషన్ ప్రాంతం వరకు పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు “పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు”, “మొక్కలు నాటుదాం – పర్యావరణాన్ని కాపాడుదాం”, “ప్రాణవాయువును పెంచుదాం – ఆరోగ్యంగా జీవిద్దాం” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఇన్‌చార్జ్ యస్.కే మహమూద్, గ్రీన్ కార్ప్స్ ఇన్‌చార్జ్ జి. ధనలక్ష్మి, సీనియర్ ఉపాధ్యాయులు ఎ. శ్రీనివాసరావు, ఎన్‌సీసీ ఆఫీసర్ రాజా గౌడ్, స్కౌట్ మాస్టర్ మహేష్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






