calender_icon.png 11 May, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను తీసుకుంటాం

24-04-2025 01:49:55 AM

భూభారతి చట్టం అవగాహన సదస్సులో మంత్రి పొన్నం

హుస్నాబాద్, ఏప్రిల్23: ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారి నుంచి భూములను తిరిగి తీసుకుంటామని, వాటిని అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో భూభారతి చట్టంపై బుధవారం జరిగిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. ‘పరంపోగు భూము లు, ప్రభుత్వ భూములు తీసుకున్న వారి లెక్కలు తీయండి.

వాటిని అభివృద్ధి కోసం ఉపయోగించండి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే, ప్రభుత్వం ఆ భూమిని గుంజుకుంటుంది. రాజకీయాలకు అతీతంగా ఆ భూములను అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తాం. భూములపై ఏమైనా సమస్యలుంటే వచ్చి అడగండి, సలహాలు ఇవ్వండి’ అని మంత్రి అన్నారు. ధరణితో ప్రజలు ఇబ్బందులు పడ్డందునే  భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు.

ధరణికి ముందు ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు ఉండేవని.. ఎవరి భూమి ఎవరు కొనుక్కుంటున్నారో పూర్తి వివరాలు అందులో ఉండేవని చెప్పారు. కానీ, ధరణి పోర్టల్ రావడంతో ఈ వ్యవస్థంతా ఛిన్నాభిన్నమైందన్నారు. తన తండ్రి భూమిని తనపేరిట మార్చుకోవడానికి కూడా రికార్డుల్లో కనిపించడం లేదంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

భూభారతి చట్టం ద్వారా గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు లేకుండా, హద్దులతో సహా అన్ని రకాల భూ వ్యవస్థకు ఒక పద్ధతి వస్తుందన్నారు. భూ హక్కులపై ఆధార్ తరహాలో ’భూధార్’ తీసుకొస్తున్నామని, గ్రామాల్లో చదువులేని వారికి కూడా భూములపై అవగాహన ఉంటుందని మంత్రి అన్నారు. సదస్సులో కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.