18 April, 2026 | 5:02 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేత కుట్రను అడ్డుకుంటాం : ఎస్‌ఎఫ్‌ఐ

18-04-2026 01:28 AM

హుస్నాబాద్, ఏప్రిల్ 17: పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేలా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఎస్‌ఎఫ్‌ఐ హుస్నాబాద్ మండల కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ ఆరోపించారు. శుక్రవారం హుస్నాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని విమర్శించారు. దీంతో ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏటా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంపై ఆధారపడి ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం రూ.10,000 కోట్ల బకాయిలను విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచిందని ఆరోపించారు. పథకాన్ని నిలిపివేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తరుణ్, తిరుపతి, సురేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.