calender_icon.png 19 January, 2026 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

19-01-2026 07:29:33 PM

రూ.3 కోట్లతో అటవికి రక్షణ గోడ.

రేగొండ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి  రూ.3.70 కోట్లు.

రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

రేగొండ/భూపాలపల్లి,(విజయాక్రాంతి): జిల్లాలో సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5,6,7,26 వ వార్డులలో రూ.3 కోట్లతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ పనులకు, మహిళా సంక్షేమ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... అడవి జంతువుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు.

మహిళల గౌరవం, భద్రత, ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొన్నారు. మహిళలకు రూ.కోటి బ్యాంకు లింకేజీ, రూ.20 లక్షల వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పొన్నం అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ... భూపాలపల్లి చుట్టూ అడవులు ఉండటంతో ఏళ్లుగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, రక్షణ గోడతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, కమ్యూనిటీ హాల్స్, గృహాలు, వైద్య సదుపాయాలతో పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

అనంతరం రేగొండ మండల కేంద్రంలో రూ.3 కోట్ల 70 లక్షలతో నిర్మించనున్న ఆర్టీసీ బస్టాండ్‌ కు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ పేదల సంస్థ అని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.రానున్న మూడేళ్లలో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రేగొండలో బస్టాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఇది ప్రజల చిరకాల వాంఛ అని,ఈ బస్టాండ్ ద్వారా చుట్టుపక్కల మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు.

రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.మేడారం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.భూపాలపల్లి, రేగొండ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. ఈ రెండు వేరువేరు కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పిడి రాజేశ్వరి, ఎంపీడీవో తరుణ్ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.