4 July, 2026 | 1:57 AM

మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిన వెల్స్ ఫార్గో

04-07-2026 01:13 AM

పర్యావరణ పరిరక్షణలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం

అమీన్ పూర్, జులై 3 :పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రముఖ సంస్థ వెల్స్ ఫార్గో బీరంగూడ గుట్టలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలో 5,200 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు.

ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణ అధికారి దేవనాదం సమక్షంలో సంస్థ ప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ నిబద్ధతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపేందుకు 5,200 మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన వెల్స్ ఫార్గో సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో కార్పొరేట్ సంస్థలు భాగస్వాములు కావడం సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

దేవాలయం తరఫున నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అవి పెద్ద వృక్షాలుగా ఎదిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సభ్యులు, ఆలయ అర్చకులు, ఎండోమెంట్స్ శాఖ అధికారులు, వెల్స్ ఫార్గో సంస్థ ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను హరితవనంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.