15 April, 2026 | 5:21 AM

బోండా ఎంత పని చేసింది!

01-02-2026 02:56 AM
  1. మింగుడు పడక బాధితుడి గొంతులో చిక్కుకుపోయిన పదార్థం
  2. ఊపిరాడక అల్లాడిపోయిన దాసరి రమేష్
  3. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి 
  4. యూసుఫ్‌గూడలో విషాదం  

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి): అల్పాహారం ప్రాణం తీసిన హదయవిదారక ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తింటున్న బోండా గొంతులో ఇరుక్కోవడం తో ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్‌నగర్ ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతానికి చెందిన దాసరి రమేష్ (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమ యంలో రమేష్ యూసుఫ్‌గూడలోని శ్రీకష్ణదేవరాయనగర్ సమీపంలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్ వద్ద బోండాలు తింటుండగా ఒక బోండా ముక్క ఒక్కసారిగా గొంతులో అడ్డుపడింది. దీంతో ఆయనకు శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడుతూ అక్కడే కుప్పకూలిపోయారు. రమేష్ పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. అయితే, ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందకపోవడం, అంతర్గత సమస్యలు తలెత్తడంతో రమేష్ శనివారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌గా కష్టపడి బతుకుతున్న రమేష్ ఇలా ఆకస్మికంగా మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.