15 April, 2026 | 6:57 AM

నెల విరామం తరువాత ఫైర్ సేఫ్టీ తనిఖీలు

01-02-2026 02:57 AM
  1. అవగాహనా కార్యక్రమాలకు హైడ్రా శ్రీకారం
  2. వ్యాపార సంఘాలతో హైడ్రా సమావేశం

సికింద్రాబాద్ జనవరి 31 (విజయ క్రాంతి): ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే కార్యక్రమానికి నెల రోజులు  విరమాం ఇచ్చామని హైడ్రా కమిషనర్‌ఏవీ రంగనాథ్ అన్నారు. ఈ మేరకు షాపుల యజమానులు,వ్యాపార సంఘాల ప్రతినిధులతో పాటు హైడ్రా, జీహెచ్ ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల రోజుల గడువులో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా షాపులు, వ్యాపార సముదాయాల వారు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది.

నెల తర్వాత తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను వివరించారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో  జీహెచ్ ఎంసీ, ఫైర్, పోలీసు విభాగాలతో హైడ్రా తనిఖీలు చేసి 9 షాపుల వరకూ సీజ్చేసిన విషయం విధితమే.

నెల రోజులు గడువు కావాలని పలు వ్యాపార సంఘాలు, దుకాణదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని సమావేశం పరిగణనలోకి తీసుకుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని పేర్కొంటూ ఆ 9 షాపుల వారి నుంచి అషిడవిట్లు తీసుకున్నాక వ్యాపారాలకు అనుమతివ్వాలని సమావేశం నిర్ణయించింది. భవిష్యత్తులో పొరపాటు జరిగితే ఉపేక్షించరాదని పేర్కొంది.