ఆరు గ్యారెంటీలు ఏమాయె?

01-05-2024 01:37:19 AM

అరచేతిలో వైకుఠం చూపిన కాంగ్రెస్

కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే నిరుపయోగమే

రాష్ట్రంలో మత విద్వేషాలు రేపే ప్రయత్నం

కొత్తగూడెం సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా బస్సుయాత్ర నిర్వహించి కొత్తగూడెం రైల్వేస్టేషన్ కూడలిలో కార్నర్ మీటింగ్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు ప్రకటించి, గద్దెనెక్కాక ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు.  

‘రూ.2 లక్షల రైతుమాఫీ ఏమైంది? ఎకరానికి రూ.6 వేల రైతుబంధు ఏది? కరెంటు కోతలు మొదలయ్యాయి. రైతుబంధు ఇవ్వడంలేదు. రైతుబీమా అడ్రస్ లేదు. మిషన్ భగీరథ తాగునీరు సరఫరా లేదు. కల్యాణ లక్ష్మికింద రూ.లక్ష నగదు, తులం బంగారం ఇప్పటివరకు ఒక్కరికైనా వచ్చిందా? చావును లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. నా కళ్ల ఎదుటే తెలంగాణ ఆగమైతుంటే చూస్తూ ఊరుకోను. పోరాటం చేస్తా.. అందుకు మీరంతా సిద్ధమా?’ అని ప్రజలను ప్రశ్నించారు.  

మత విద్వేషాలు రేపుతున్న కాంగ్రెస్, బీజేపీ

 కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని.. వారికి ఓటేస్తే నిరూపయోగమని కేసీఆర్ అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకులాలు పెట్టి విధ్యాభివృద్ధికి వేల కోట్లు వెచ్చించి మెరుగైన విద్య అందించానని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు రాష్ట్రంలో కులమతాల చిచ్చు లేదని, నేడు మత విద్వేషాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత సీఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రద్దుచేస్తా అంటున్నారని, జిల్లా ఉండాలా వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కులు కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్ ఎంపీలు గెలవాలని అన్నారు. కేసీఆర్ బీఆర్‌ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, తాతా మధు, వనమా వెంకటేశ్వరరావు, బానోత్ హరిప్రియ, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.