జగిత్యాలకు జీవన్‌రెడ్డి చేసిన మేలేంటి?

30-04-2024 02:23:19 AM

నిజాం షుగర్స్ మూతపడడానికి కారణం ఆయనే..

కాంగ్రెస్ హయాంలోనే గల్ఫ్ బాధితుల గోస

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్

జగిత్యాల, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా కొనసాగారని, ఇన్నేళ్లలో ఆయన జగిత్యాలకు చేసిన మేలేమిటో ప్రజలకు తెలియజేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బీర్‌పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. నిజాం షుగర్స్ పరిశ్రమ మూతపడడానికి కారణం జీవన్‌రెడ్డినే అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మామిడి రైతులకు అన్యాయం జరిగిందని, గల్ఫ్ బాధితులు గోస పడ్డారని మండిపడ్డారు. తాను ఎంపీగా పసుపు బోర్డు ను తీసుకొచ్చి పసుపు పంటకు మద్దతు ధర తెచ్చానన్నారు. జీవన్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే జగిత్యాల ను లవ్‌జిహాద్‌కు అడ్డాగా చేస్తారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్ ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. బీజేపీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్ పీపుల్ ఫోరం ఏర్పాటు చేస్తుందని, తద్వారా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రకటించారు. జగిత్యాలకు రోళ్లవాగు కాళేశ్వరం లాంటిదని, వాగు ద్వారా ఇప్పుడు పంటలకు నీరందడం లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.500 ధాన్యంపై బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.  ప్రచారంలో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ బోగ శ్రావణి, నాయకులు పల్లె గంగారెడ్డి, పైడిపల్లి సత్యనారాయణ రావు, జడ్పీటీసీ పాత పద్మ పాల్గొన్నారు.