మన సత్తా ఎంత ?
- నీరజ్ చోప్రా, మీరాబాయి, లవ్లీనాలపై ఆశలు
- బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌పై అంచనాలు
- పతకాలు వచ్చే క్రీడలు తొలగింపు
- 126 మందితో భారత బృందం
కామన్‌వెల్త్ గేమ్స్ ఎప్పుడు జరిగినా భారత్ ఖచ్చితంగా టాప్- నిలుస్తూ వస్తోంది. 2010 ఢిల్లీ వేదికగా జరిగినప్పుడు సెంచరీ కొట్టిన భారత్ తర్వాత వరుసగా మూడు ఎడిషన్లలో 60కి పైగా పతకాలు గెలిచిన మన అథ్లెట్లు ఈ సారి ఎన్ని మెడల్స్ గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. పతకాలు ఖచ్చితంగా వచ్చే చాలా క్రీడలు తొలగించడంతో గ్లాస్గోలో అంచనాలు పెట్టుకోవద్దని పలువురు మాజీలు సూచిస్తున్నారు
గ్లాస్గో, జూలై 22 : ఈ సారి కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఎన్ని పతకాలు గెలుస్తుందన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో ఉంది. మొత్తం 126 మందితో భారత బృందం గ్లాస్గోలో అడుగుపెట్టింది. అయితే గతంతో పోలిస్తే ఈసారి భారత్ పతకాల సంఖ్య తగ్గిపోనుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కామన్‌వెల్త్ గేమ్స్ లో మన క్రీడాకారులు ఖచ్చితంగా పతకాలు సాధిస్తున్న ఈవెంట్లలో చాలా వాటిని తొలగించారు. బడ్జెట్ పరిమితుల కారణంగా ఆతిథ్య నగరమైన గ్లాస్గో క్రీడల సంఖ్యను కేవలం 10కి కుదించింది.
దీనివల్ల భారత్‌కు పతకాలు గ్యారెంటీగా ఇచ్చే కొన్ని ముఖ్యమైన క్రీడలు ఈసారి టోర్నీలో లేవు. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, హాకీ, క్రికెట్ ఈ సారి కామన్‌వెల్త్ గేమ్స్ లో లేవు. గత 2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌ల్లో భారత్ 22 స్వర్ణాలతో కలిపి మొత్తం 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. గత టోర్నీలో భారత్ సాధించిన 61 పతకాలలో 30 పతకాలు ఈ తొలగించిన క్రీడల నుండే వచ్చాయి.
ఈసారి పతకాల సంఖ్య గతంతో పోలిస్తే తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న క్రీడల్లో మన అథ్లెట్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈసారి 13 విభాగాల్లో పోటీ పడుతున్న భారత బృందం ప్రధానంగా అథ్లెటిక్స్ ,బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ , జూడోలలో పతకాలపై ఆశలు పెట్టుకుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ నుండి అత్యధికంగా 32 మంది పాల్గొంటున్నారు. నీరజ్ చోప్రా ద్వారా భారత్‌కు జావెలిన్ త్రోలో క్లీన్‌స్వీప్ లేదా ఖచ్చితమైన స్వర్ణం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు సంబంధించి లాంగ్ జంప్‌లో మురళీశ్రీశంకర్ మెడల్ గెలిచే అవకాశాలున్నాయి. స్టీపుల్ ఛేజ్‌లో పారుల్ చౌదరిపైనా అంచనాలున్నాయి.
మరోవైపు బాక్సింగ్‌లో ఎప్పటిలానే ఖచ్చితంగా మెడల్స్ రానున్నాయి. వరల్డ్ బాక్సింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం కామన్వెల్త్ దేశాల్లో భారత మహిళా బాక్సర్లు అగ్రస్థానంలో ఉన్నారు. కనీసం ఐదుగురు మహిళా బాక్సర్లు ఫైనల్స్ చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక వెయిట్ లిఫ్టింగ్ లోగత రికార్డుల ప్రకారం మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించే అవకాశముంది.అటు జూడోతో పాటు పారాస్పోర్ట్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు అవకాశముందని భావిస్తున్నారు.
భారత్ అథ్లెట్లు : 126
పోటీపడుతున్న క్రీడాంశాలు : 13
పతకాలు వచ్చే క్రీడలు : అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, జూడో, పారా అథ్లెటిక్స్
2022లో భారత్ : 61 పతకాతో 4వ స్థానం (22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు)






