21 May, 2026 | 2:41 AM

ఇదెక్కడి వివక్ష?

21-05-2026 01:24 AM

కొత్త హెల్త్ స్కీం అమలుపై సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన

భవిష్యత్తులో 2.6 లక్షల మంది సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకూ సమస్యే

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అమలు చేయనున్న నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్) అందరికీ వర్తించే పరిస్థితి కనిపించ డం లేదు. మరీ ముఖ్యంగా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అమలయ్యే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వానికి తమపై వివక్ష ఎందుకని సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం నూతన హెల్త్ స్కీంను అమలుచేయబోతోంది. ఇంతవరకే బాగానే ఉన్నా.. సీపీఎస్ విధానం కింద రిటైర్ అయిన వారికి ఇది వర్తించని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు దాదాపు వివిధ సీపీఎస్ ఉద్యోగులుగా రిటైర్‌అయిన వారు 3 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికీ నూతన హెల్త్ స్కీం అమలయ్యే అవకాశం లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.     

భరోసా ఏదీ..

రాష్ట్రంలో 3.60 లక్షల మంది ఉద్యోగులుంటే అందులో దాదా పు 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులే ఉన్నారు. మిగిలిన మరో లక్ష మంది ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) ఉద్యోగులున్నారు. రాష్ట్రంలో ఓపీఎస్ విధానం 2004 ఆగస్టు 31 వరకు అమల్లోకి ఉండేది. ఆతర్వాత అంటే 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానం అమల్లోకి వచ్చింది. ఇక్కడే ఒక మెలిక ఉంది. ఓపీఎస్ కింద నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే పెన్షన్ వస్తుంది.

అదే సీపీఎస్ కింద నియామకమై రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు, పైస్థాయి ఉన్నతాధికారులు ఎవరైనా వారికి పెన్షన్ రాదు.  ప్రభుత్వమేమో తాను ఇచ్చే నూతన హెల్త్ స్కీంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్లకూ హెల్త్ కార్డులు జారీచేస్తామని అంటున్నది. ఇందుకు వారి మూల వేతనం నుంచి ప్రతి నెల 1.5 శాతం నిధులు కట్ చేసి హెల్త్ ట్రస్ట్‌లో జమచేస్తుంది. అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్ కింద ప్రభుత్వం 1.5 శాతం నిధులను ట్రస్ట్‌లో జమచేసి ఆ మొత్తాన్ని క్యాష్‌లెస్ వైద్యం కింద చికిత్స కోసం ఖర్చు చేయనున్నారు.

కానీ ఇక్కడ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అన్యాయం జరగనుంది. ఇప్పటికిప్పుడు అయితే అన్యాయం జరిగేది సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకే. ఎందుకంటే వీరు సీపీఎస్ ఉద్యోగులు కావడంతో వీరికి పెన్షన్ రాదు. పెన్షన్ రాకుంటే నెల నెలా 1.5 శాతం డబ్బులు కట్ కాని పరిస్థితి. దీంతో తమకు భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం నుంచి భరోసా ఏదీ? అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడిస్తారట..తర్వాత ఇవ్వరట! (బాక్స్)

రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల్లో 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులే ఉన్నారు. వీరిలో ప్రతి నెలా ఎంతో కొంత మంది రిటైర్ అవుతునే ఉంటారు. అయితే ఉద్యోగంలో ఉన్నంతకాలం వీరి మూలవేతనం నుంచి డబ్బులు కట్ చేసి వీరికి క్యాష్ లెస్ చికిత్సను అందిస్తారు. కానీ రిటైర్డ్ అయిన మరుక్షణం నుంచి వీరికి ఈ హెల్త్ స్కీం, కార్డులు అమలుకావు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత వీరికి ఇతర ఉద్యోగుల (ఓపీఎస్) తరహాలో పెన్షన్ రాదు.

పెన్షన్ రాకపోతే డబ్బులు ఎలా ట్రస్టుకు జమఅవుతాయి? జమ కాకుంటే వీరికి క్యాష్‌లెస్ చికిత్స ఎలా అందిస్తారు?. అంటే ఉద్యోగంలో ఉన్నంతవరకు మాత్రమే వీరికి వర్తిస్తుంది. భవిష్యత్తులో వీరంతా ఈ సమస్యను ఎదుర్కోబోతున్నవారే. ఈక్రమంలోనే ఇప్పుడు రిటైర్ అయిన దాదాపు 3 వేల మంది ఉద్యోగులకు హెల్త్ స్కీంను అమలుచేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ అధ్యక్ష, కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ డిమాండ్ చేస్తున్నారు.

సర్వీసులో ఉన్నంతకాలం డబ్బులు కట్ చేసుకొని రిటైర్డ్ అయిన తర్వాత హెల్త్ స్కీంను అమలుచేయడమంటే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ ఉండదు కాబట్టి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) ఐడీల ఆధారంగానే ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో పెన్షనర్ల వివరాలు అప్‌లోడ్ చేసి హెల్త్ స్కీంను అమలుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీరికివ్వకుంటే సీపీఎస్ ఉద్యోగుల ఖాతా నుంచి కూడా డబ్బులు ట్రస్టులో జమచేయొద్దని వారు చెప్తున్నారు.