12 April, 2026 | 10:54 PM

ఇప్పుడు బాధపడి ఏంలాభం!

08-12-2024 02:27 AM

‘ఇప్పుడు ఏడ్చి ఏంలాభం?’ అనే వ్యాఖ్యలు తరచూ వింటుంటాం. ఏదైనా పని చేసేటప్పుడు ఎవరి సలహాలు తీసుకోకుండా ఒంటెత్తు పోకడలకు పోయి ఆ తర్వాత అది విఫలం అయినప్పుడు ఎడ్డిస్తూ ఉంటారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పరిస్థితి ఇలానే ఉంది. నాడు సచివాలయాన్ని నిర్మించిన కేసీఆర్.. నేడు అదే ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష హోదాలో ఆహ్వానం అందుకున్నారు.

తన హయాంలో నిర్మించిన సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయలేకపోయారు. సీఎంగా ఉన్నప్పుడే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఈ రోజు ప్రతిపక్షనేత స్థానంలో ఆహ్వానం అందుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. చేసే అవకాశం, అధికారం ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు బాధపడితే ఏం లాభమని అనుకుంటున్నారు. సచివాలయానికి ఎదురుగా అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారని గుసగుసలాడుకుంటున్నారు.