calender_icon.png 3 February, 2026 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేతో పనేంటి.. సొమ్ము ఉంటేనే బీ ఫారం!

03-02-2026 12:00:00 AM

  1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టిక్కెట్ల లొల్లి. 

మేయర్ పదవికి రూ 10 నుంచి 15 కోట్లు..

చైర్మన్ పదవికి రూ 2 నుంచి 3 కోట్లు...

ఆశావాహుల్లో బి ఫారాల టెన్షన్..

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 2, (విజయక్రాంతి): ప్రజాదరణ ఉన్న... గెలిసే సత్తా చూపిన... సరిపడ సొమ్ము ఉంటేనే బి ఫారం అనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలలో ఎన్నికలవేళ రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయాలనుకున్న ఆశావాహులకు సర్వేభయం పట్టుకుంది.

క్షేత్రస్థాయిలో ప్రజల మన్ననలు ఉన్నప్పటికీ సరిపడ నిధులు సమకూర్చ గల వారికే బి ఫారాలు దక్కుతాయని ప్రచారంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీని అంటిపెట్టుకొని ప్రజా సమస్యలతో నిత్యం ప్రజల మధ్య ఉన్నప్పటికీ డబ్బులు లేకపోవడంతో అభ్యర్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. 

కోట్లు పలుకుతున్నమేయర్, చైర్మన్ పదవులు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో మేయర్, చైర్మన్ పదవులకు డిమాండ్ పెరిగింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి దక్కించుకోవాలంటే రూ 10 నుంచి 15 కోట్లు, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపల్ చైర్మన్ పదవులకు రూ.2 నుంచి 3 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ ప్రధాన ప్రార్టీలు చెబుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

ఉన్నత పదవులే కాకుండా కార్పొరేటర్, కౌన్సిలర్ టిక్కెట్ల కోసం అభ్యర్థులు పెద్ద మొత్తంలో డిపాజిట్లను చూపాల్సి వస్తోంది. ఒక్కొక్క డివిజన్ నుంచి పోటీ చేయాలంటే రూ 25 నుంచి 35 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నేతలు స్పష్టం చేస్తున్నారు. డబ్బులు లేని కార్యకర్తలకు టిక్కెట్లు దక్కే అవకాశం లేదంటున్నారు. రాజకీయ సిద్ధాంతాలతో సంబంధం లేకున్నా ఆర్థిక స్తోమత చాలినంత ఉంటే వారికే పార్టీలు పెద్దపీట వేయటం మాజీ ప్రజాప్రతినిధులకు మింగుడు పడటం లేదు.

ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతి వార్డు, డివిజన్లో సర్వేలు నిర్వహించి గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఆర్థిక బలం ఉంటుందో వారికే టిక్కెట్లు కేటాయించే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు బహు ఖరీదుగా మారాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్లలో 592 మంది అభ్యర్థులు 807 నామినేషన్లు సమర్పించారు.

నామినేషన్ల పరిశీలనలో 215 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. 592 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమ, మంగళవారాల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మంగళవారం సాయంత్రం బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు తేటతెల్లమవుతాయి. ఏది ఏమైనా ఎన్నికలు ధనవంతుడికి మాత్రమే అనే విషయం స్పష్టం అవుతుంది.