15 July, 2026 | 2:19 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

ప్రాణాలు తీసిన వాట్సాప్ పంచాయితీ

08-06-2024 01:46 AM

యువకుల మర్డర్ కేసులో ఏడుగురు నిందితులు అరెస్టు

కేసు వివరాలను వెల్లడించిన సీపీ అవినాష్ మహంతి

రంగారెడ్డి, జూన్ 7 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలో ఇద్దరూ యువకులు గుండెమోని శివ, శేషగారి శివ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను శుక్రవారం శంషాబాద్ డీసీపీ కార్యాలయం ఆవరణలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. కడ్తాల మండలం గోవిందాయిపల్లికి చెందిన హత్యకు గురైన యువకులు గుండెమోని శివ, శేషగారి శివ, ప్రధాన నిందితుడు బల్కం రవి ఒకే గ్రామానికి చెందినవారు.

వీరంతా గతంలో బీజేపీ అనుబంధ బీజేవైఎంలో పనిచేసేవారు. వారి మధ్య తలెత్తిన కొన్ని మనస్పర్థల కారణంగా గుండెమోని శివ, శేషగారి శివ ఇటీవల బీజేవైఎంను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెల 4న బల్కం రవి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, అందుకు సంబంధించిన ఫొటోలను గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దాదాపుగా 300కు పైగా ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో గుండెమోని శివ, శేషగారి శివ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో ఇన్ని ఫొటోలు ఎందుకు పోస్ట్ చేశావని రవిని ఫోన్‌లో నిలదీశారు. గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న శేషగిరి శివ ఆ ఫొటోలను డిలీట్ చేయడంతో పాటు రవిని గ్రూప్ నుంచి తొలగించాడు.

ఈ విషయమై ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో కూడా తాను గ్రామంలో పలు సోషల్ యాక్టివిటీ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తే ఇదే విధంగా చేశాడని రవి అవమానంగా భావించాడు. పార్టీని వీడడం, గ్రూప్‌లో పోస్టులు డిలీట్ చేయడం అవమానంగా భావించిన రవి ఇదంతా మనసులో పెట్టుకొని వారిని అంతమొందించాలని తన మిత్రులు పల్లె నాగరాజు గౌడ్, తాళ్లకొండ రాజు, గిల్లికుంట్ల విజయ్, నిట్ట  ప్రవీణ్, వల్లపు దాస్ శేఖర్, తిరుపతి జగదీష్ గౌడ్‌తో కలిసి ప్లాన్ వేశాడు.

దీంతో ప్రధాన నిందితుడు రవికి చెందిన కారులో మహేశ్వరం నియోజకవర్గంలోని గాయత్రి నగర్‌లో 6వ తేదీన గుండెమోని శివ, శేషగారి శివను మాట్లాడుకుందాం అని చెప్పి బలవంతంగా కారులో ఎక్కించుకొని కడ్తాల మండలంలోని బటర్ ఫ్లుసైటీలోని విల్లాకు తీసుకువచ్చారు. అనంతరం వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించిన విషయంపై ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకొంది.

దీంతో రవి తన స్నేహితులు నాగరాజు, విజయ్‌తో కలిసి శేషగారి శివను గదిలోకి తీసుకెళ్లి కత్తితో మెడ, ఛాతీ, తొడ భాగంలో దారుణంగా పొడిచారు. దీంతో భయాందోళనకు గురైన గుండెమోని శివ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయగా.. అప్పటికే డోర్లు లాక్ చేసిన నిందితులు అతడిని కూడా దారుణంగా హత్య చేసి విల్లాకు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయారు. కాగా, విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన చేధించిన పోలీసులకు సీపీ అభినందనలు తెలిపారు.