పొలాల్లో ఒరిగిన విద్యుత్ స్తంభాలు
పట్టించుకోని అధికారులు
ప్రమాదకరంగా మారడంతో రైతుల ఆందోళన
జహీరాబాద్, జూన్ 7: సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని కాకిజనవాడ గ్రామంలో వ్యవసాయ పొలాలనుంచి మూర్తుజాపూర్ గ్రామం వెళ్లే 11కేవీ కరెంట్ స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ తీగలు పొలాల్లో చేతికి అందే ఎత్తులో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాటికి మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు మూడేళ్లుగా విన్నవిస్తున్నా కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులే మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఖర్చుల కోసం తమనే డబ్బులు అడిగారని ఆరోపించారు. తాము డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపారు.
విత్తనాలు విత్తుకునే సమయం దగ్గర పడిందని, ఇప్పుడు అయితేనే ఒరిగిపోయిన స్తంభాలు, లూజ్ వైర్లకు మరమ్మతులు చేసే వీలుంటుందని, పంటలు ఏపుగా ఎదిగినప్పుడు అవకాశం ఉండదని రైతులు చెబుతున్నారు. విద్యుత్ తీగలు కిందకు ఉండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొలాల్లో పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒరిగిపోయిన కరెంట్ స్తంభాలు ఉన్నచోట్ల చెట్ల కొమ్మలకు వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు, పంపు సెట్లు కాలిపోతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా, ఈ విషయాన్ని సంబంధిత మండల విద్యుత్ శాఖాధికారి అర్జున్ దృష్టికి తీసుకెళ్లగా వారం రోజుల్లో ఒరిగిపోయిన స్తంభాలు, లూజ్ వైర్లకు మరమ్మతులు చేపడతామని తెలిపారు.






